
సమ్మె నోటీసు ఇచ్చిన ఆశాలు
నెల్లూరు (వీఆర్సీసెంటర్): ఆశా వర్కర్ల న్యాయమైన కోర్కెల సాధనకు, ఆశాలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలన్న డిమాండ్లపై ఈ నెల 20వ తేదీ నుంచి సమ్మె చేపడుతున్నట్లు సోమవారం నోటీసును జిల్లా వైద్యాధికారిణి సుజాతకు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయలక్ష్మి, అన్నపూర్ణమ్మ అందజేశారు. వారు మాట్లాడుతూ ఆశా వర్కర్స్ న్యాయమైన కోర్కెల సాధన కోసం 20వ తేదీ నుంచి సమ్మె ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆశాలు 20 ఏళ్ల నుంచి పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారని, వీరిని ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్‌ను ఆశాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. ఆశాలకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వం అందించనున్న సంక్షేమ పథకాలు ఆశాలకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధుసూదన, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.