
పీపీపీతో మెరుగైన వైద్యసేవలు
● మంత్రి సత్యకుమార్‌యాదవ్
వింజమూరు(ఉదయగిరి): ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి వైద్యశాలలను నిర్మించి మెరుగైన వైద్యాన్ని అందిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ పేర్కొన్నారు. వింజమూరులోని సీహెచ్‌సీలో ఐదు పడకల డయాలసిస్ సెంటర్‌తో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన జనరేటర్‌ను శనివారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రానున్న మూడు నెలల్లో పీీపీపీ విధానంలో ఉదయగిరిలో 150 నుంచి 300 పడకల కార్పొరేట్ వైద్యశాల ఏర్పాటుకు అనుమతులను మంజూరు చేస్తామని చెప్పారు. దీనికి అవసరమైన భూమి, ఇతర సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమంత్రి డయాలసిస్ పథకం ద్వారా 18 కొత్త కేంద్రాలను ప్రారంభించామని, వీటి నిర్వహణకు గానూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.65 కోట్లను మంజూరు చేశామని వెల్లడించారు. కాగా ఆరోగ్యశ్రీలో పేదలకు కార్పొరేట్ వైద్యసేవలు అందకపోగా, అధిక మొత్తంలో బిల్లులేసి ప్రభుత్వం నుంచి నగదును వసూలు చేస్తున్నారనే అంశాన్ని మంత్రికి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి తెలియజేశారు. ఉదయగిరిలో మరో డయాలసిస్ కేంద్రంతో పాటు అత్యవసర వైద్య విభాగ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కోరారు. మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, బీజేపీ నేత భరత్, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, మెట్టుకూరి చిరంజీవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.