
ట్రాలీని ఢీకొన్న గూడ్స్ వాహనం
● వ్యక్తి దుర్మరణం
గుడ్లూరు: ట్రాలీని గూడ్స్ వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని తెట్టు ఫ్లయ్‌ఓవర్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్సై వెంకట్రావు వివరాల మేరకు.. విజయవాడలోని కృష్ణలంకకు చెందిన పక్కెళ్ల శ్రీనివాసరావు (48) గూడ్స్ వాహనాన్ని నడుపుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని కలిగిరిలో ఫర్నిచర్ సామగ్రిని వాహనంలో తీసుకెళ్లి తిరుగుపయనమయ్యారు. ఇదే సమయంలో ట్రాలీ లారీ చైన్నె నుంచి యంత్రాలతో జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు వెళ్తోంది. ఈ తరుణంలో ముందు వెళ్తున్న ట్రాలీని ఆటో ఢీకొనడంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న హైవే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.