
విద్యుత్ బకాయిలపై దృష్టి సారించాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ బకాయిలపై అధికారులు, సిబ్బంది దృష్టి సారించాలని ఎస్పీడీసీఎల్ రెవెన్యూ, ఇంటర్నల్ ఆడిట్ విభాగ చీఫ్ జనరల్ మేనేజర్ రాజశేఖర్ ధర్మజ్ఞాని ఆదేశించారు. నగరంలోని విద్యుత్ భవన్‌లో జిల్లా అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. బిల్లుల చెల్లింపులను సులభతరం చేసేందుకు గానూ బకాయిల్లేని వినియోగదారుల బిల్లులపై క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తున్నామని వివరించారు. విద్యుత్ సమస్యలపై టోల్‌ఫ్రీ నంబర్ 1912 లేదా వాట్సాప్ గవర్నెన్స్ 95523 00009ను సంప్రదించాలని కోరారు. అదనపు లోడ్ క్రమబద్ధీకరణకు 50 శాతం రాయితీని సంస్థ కల్పిస్తోందని, దీనిపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో డీసీ లిస్ట్ ఎక్కువగా ఉందని, దీన్ని తగ్గించాలన్నారు. ఎస్‌ఈ విజయన్, సూర్యఘర్ జిల్లా నోడల్ అధికారి శేషాద్రిబాలచంద్ర, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మురళి, ఈఈ పరంధామయ్య తదితరులు పాల్గొన్నారు.