రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో కక్షసాధింపు | - | Sakshi
Sakshi News home page

రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో కక్షసాధింపు

Apr 11 2025 12:10 AM | Updated on Apr 11 2025 12:10 AM

రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో కక్షసాధింపు

రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో కక్షసాధింపు

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. రాజకీయ కక్షసాధింపులకే కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని విక్రమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళీధర్‌ తదితరులు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రమ్‌రెడ్డి మాట్లాడారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తున్న ఆయనపై రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేశారని మండిపడ్డారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కథనాన్ని ప్రచురించిన ఈనాడు దినపత్రిక.. ఆయన్ను దోషి అని తేల్చేసిందని విమర్శించారు. ఒకవేళ ఇదే నిజమైతే వారి వద్ద ఉన్న ఆధారాలను కోర్టుకు ఎందుకు ఇవ్వలేదని, ఇది కుట్ర కాదానని ప్రశ్నించారు. తొలుత ఆరోపణలు చేయడం, దాన్ని మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఆపై కేసులు నమోదు చేయించడం వంటి పనులు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఎలాంటి పనులు చేయొద్దంటూ ఓ సభలో సీఎం చంద్రబాబే చెప్పారని, తమ పార్టీకి 40 శాతం మంది ఓట్లేశారని, ప్రభుత్వం నుంచి వీరు ఎలాంటి లబ్ధి పొందకూడదానన్నారు. జిల్లాలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను అమలు చేస్తే పది నెలల వ్యవధిలో ఇసుక, మైనింగ్‌, మట్టి ఇలా అన్ని అంశాల్లో జరుగుతున్న అవినీతి బయటపడుతుందని తెలిపారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్‌ చేసేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా పాలన సాగించాలని సూచించారు.

బలంగా గొంతు వినిపిస్తే కేసులే

ప్రతిపక్ష పార్టీలో ఎవరైతే బలంగా గొంతు వినిపిస్తున్నారో వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. పోలీస్‌ శాఖను ప్రభుత్వం ఎలా వాడుకుంటోందనేందుకు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై జరుగుతున్న వేధింపులే ప్రత్యక్ష నిదర్శనమని వ్యాఖ్యానించారు. కాకాణి, ఆయన కుటుంబసభ్యులపై కేసులు పెట్టి వేధించడాన్ని ఖండించారు. ఇలా వ్యవహరిస్తే తమ పార్టీ శ్రేణులు భయపడతారనుకుంటే అది భ్రమేనన్నారు. కావలి నియోజకవర్గంలో బెట్టింగ్‌లు, క్యాసినో తదితరాలను ఎలా ఆడిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారని చెప్పారు. చంద్రబాబు బూటకపు హామీలను నమ్మి ఓటేసి జగన్‌మోహన్‌రెడ్డికి అన్యాయం చేశామనే పశ్చాత్తాపం గ్రామాల్లో మహిళల నుంచి వ్యక్తమవుతోందని వివరించారు. టీడీపీ నేతల ఒత్తిడితో మీరు చేసే పనులు శాపాలుగా మారకుండా చూసుకోవాలని హితవు పలికారు. పార్టీ జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు బాలిరెడ్డి సుధాకర్‌రెడ్డి, అశ్రిత్‌రెడ్డి, మండల కన్వీనర్లు పిచ్చిరెడ్డి, శంకర్‌రెడ్డి, అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ఆదిశేషయ్య తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి

పార్టీ నేతల విలేకరుల సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement