
చంద్రబాబూ.. మహిళలకు పథకాలెప్పుడిస్తారు
నెల్లూరు(బారకాసు): మహిళల కోసం ఎప్పటి నుంచి పథకాలను అమలు చేస్తారో సీఎం చంద్రబాబు చెప్పాలని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీసునంద డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని డైకస్‌రోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా మహిళా సాధికారత గురించి చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలతో మహిళలకు అండగా నిలిచారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదినెలలవుతున్నా మహిళలకు ఉచిత బస్సు ఊసే ఎత్తడం లేదన్నారు. తల్లికి వందనం పథకాన్ని అమ లు చేయకుండా నీరుగారుస్తున్నారన్నారు. అలాగే ఆడబిడ్డ నిధికి బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. సున్నావడ్డీ రుణాలు ఎప్పుడిస్తారో ప్రకటన చేయాలన్నారు. ఆశావర్కర్లకు జీతాలు పెంచుతామని, పనిభారం తగ్గిస్తామని చెప్పి నిలువునా మోసం చేశారని చెప్పారు. ఎన్నికల సమయంలో వలంటీర్లకు నెలకు రూ.10 వేలు ఇస్తామన్నారని, ఇప్పుడు ఆ ఉద్యోగమే లేకుండా చేసి వారి కడుపుకొట్టడం న్యాయమా అని కూటమి నేతల్ని ప్రశ్నించారు. 2014 – 19 మధ్య కూడా చంద్రబాబు మహిళలను మోసం చేశారన్నారు. జగన్ దిశ యాప్‌ను తీసుకొస్తే, దానిని నేడు శక్తి యాప్ అంటూ హంగామా చేస్తున్నారన్నారు. జగన్ ప్రవేశపెట్టిన వ్యవస్థలను కాపీ కొడుతున్నారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలిచ్చిందన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం కేటాయించారని చెప్పారు. స్థానిక సంస్థల పదవులను కూడా 50 శాతం వారికే ఇచ్చారన్నారు. చంద్రబాబు హామీలను నెరవేర్చాలని లేనిపక్షంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో ఆ పార్టీ రూరల్ నియోజకవర్గ మహిళా, అంగన్‌వాడీ, సాంస్కృతిక విభాగాల అధ్యక్షులు బషీర, శాలిని, శారద, కార్యవర్గ సభ్యురాలు ఫరీదా తదితరులు పాల్గొన్నారు.
ప్రతి మహిళకు అండగా నిలిచిన
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం
జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీసునంద