బిట్రగుంట: బోగోలు మండలం చెంచులక్ష్మీపురం గ్రామానికి చెందిన బిజ్జం వెంకారెడ్డి (75) తన ఇంట్లోనే ఉరేసుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వెంకారెడ్డి కుటుంబ సభ్యులంతా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఆయన ఒక్కడే స్థానికంగా నివాసం ఉంటున్నాడు. ఆ ఇంట్లో తిరుపతికి చెందిన శాంతమ్మ అనే మహిళ ఏడాది నుంచి పనిమనిషిగా ఉంది. ఈనెల 4వ తేదీన యజమాని మందలించాడనే కారణంతో శాంతమ్మ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో ఏం జరిగిందో గానీ వారం తిరిగేసరికి వెంకారెడ్డి కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.