కారుణ్య నియామకాలు
నెల్లూరు(అర్బన్): విధి నిర్వహణలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ముగ్గురికి కలెక్టర్ ఆనంద్ కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా రెవెనూ అధికారి (డీఆర్వో) ఉదయభాస్కర్‌రావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి విజయకుమార్ ఉద్యోగాలు పొందిన వారికి నియామక ఉత్తర్వులు అందించారు. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో హెడ్ కానిస్టేబుళ్లుగా ఉంటూ మృతి చెందిన ఎం.ధనుంజయ కుమారుడు ఎం.హరికృష్ణకు, షేక్ ఇలియాజ్ కుమార్తె జాస్మిన్‌కు రెవెన్యూ శాఖలో ఉద్యోగం కల్పించారు. రెవెన్యూ విభాగంలో పనిచేస్తూ మృతి చెందిన ఎన్.మస్తానయ్య కుమారుడు మనోజ్‌సాయికుమార్‌కు అదేశాఖలో ఉద్యోగం కల్పించారు. డీఆర్వో ఉదయభాస్కర్‌రావు ఉద్యోగాలు పొందిన వారికి అభినందనలు తెలిపారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించి వారి మన్ననలు అందుకోవాలని కోరారు.
వెంకటశేషయ్యకు
బెయిల్ మంజూరు
వెంకటాచలం: జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్యకు శుక్రవారం బెయిల్ మంజూరైంది. గత నెల 23వ తేదీన వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌లో వెంకటశేషయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించిన విషయం విదితమే. ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా 6వ అదనపు జడ్జి అనుమతిస్తూ బెయిల్ మంజూరు చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, వెంకటశేషయ్య కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రైవేట్ బస్సులకు అనుమతులిస్తాం
నెల్లూరు(అర్బన్): నగరంతో పాటు జిల్లాలోని ఇతర పట్టణాల్లో ప్రైవేట్ బస్సులు నడిపేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకుంటే వెంటనే అనుమతులిస్తామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో రవాణాశాఖాధికారులు, ప్రైవేట్ బస్సుల యజమానులతో సమావేశం జరిగింది. ఇప్పటికే నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో బస్సులు నడిపేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా రవాణా శాఖ (ఆర్‌టీసీ) లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసి ప్రైవేట్ ఆపరేటర్లకు అనుమతులివ్వాలని రవాణాశాఖాధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరంతో పాటు రూరల్ పరిధిలో ఇప్పటికే అనుమతి ఉన్న 7 రూట్లలో, నూతనంగా అనుమతి కోరిన మరో 7 రూట్లలో ప్రైవేట్ బస్సులను నడుపుకునేందుకు పంపిన దరఖాస్తులను ఆమోదిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఆర్టీసీ కూడా ప్రైవేట్ యాజమాన్యాలతో పోటీగా నగరంలో సిటీ బస్సులను నడపాలని కోరారు. ఈ సమావేశంలో ఉప రవాణా కమిషనర్ చందర్, ఆర్టీఓ సిరిచందన, జిల్లా ప్రజారవాణాధికారి మురళీబాబు, పలువురు రవాణా, ప్రజారవాణా శాఖల అధికారులు, దరఖాస్తు చేసుకున్న ప్రైవేట్ ఆపరేటర్లు పాల్గొన్నారు.
31వ తేదీలోపు
దరఖాస్తు చేసుకోవాలి
నెల్లూరు (టౌన్): జిల్లాలో కొత్తగా ప్రైవేట్ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయాలనుకునే వారు ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌ఐఓ శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అఫిలియేషన్ రెన్యూవల్, అడిషనల్ సెక్షన్లు, కోర్సులు, షిప్టింగ్, పేరు, తదితర ప్రక్రియలకు సంబంధించి వచ్చే నెల ఫిబ్రవరి 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించామని, ఆయా రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల నామినల్ రోల్స్‌ను సరి చూసుకోవాలన్నారు.
కారుణ్య నియామకాలు
కారుణ్య నియామకాలు


