
పొదలకూరు: రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేసిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టి వైద్యనిపుణులను గ్రామాలకు రప్పించి వైద్యసేవలు అందిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు మండలం దుగ్గుంటరాజుపాళెం గ్రామంలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని కలెక్టర్ ఎం.హరినారాయణన్, వ్యవసాయశాఖ కమిషనర్, జిల్లా ప్రత్యేకాధికారి హరికిరణ్‌లతో కలిసి మంత్రి కాకాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హెల్ప్‌డెస్క్, వైద్యవిభాగాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ వైద్యం అందాలన్న తలంపుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. వైఎస్సార్ తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకేసి నాణ్యమైన వైద్యాన్ని పేదల ముంగిటకే తీసుకువచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 3,255 వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చి మెరుగైన వైద్యసేవలను అందిస్తోందని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, గ్రామాల్లో ఆరోగ్యకరమైన కుటుంబాలు ఉండాలనే ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఏడాదికొక పర్యాయం వైద్యపరీక్షలు :
జిల్లా ప్రత్యేకాధికారి హరికిరణ్
ప్రతి ఒక్కరూ 40 ఏళ్లు దాటిన తర్వాత ఏడాదికొక పర్యాయం వైద్యపరీక్షలు చేయించుకోవాలని జిల్లా ప్రత్యేకాధికారి, వ్యవసాయశాఖ కమిషనర్ హరికిరణ్ సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్షలో వైద్యపరీక్షలు నిర్వహించి అవరమైతే మెరుగైన వైద్యం కూడా అందిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
గ్రామాలకే వైద్యనిపుణులు :
కలెక్టర్ హరినారాయణన్
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వైద్యనిపుణులు గ్రామాలకే వచ్చి ప్రజలకు వైద్యసేవలు అందిస్తారని కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. 104 వాహన సేవలకు భిన్నంగా 45 రోజులపాటు జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాలు ఉంటాయన్నారు. ఇదే శిబిరంలో ఆరోగ్యశ్రీపై కూడా అవగాహన కల్పిస్తారని, చికిత్సపొందిన వారికి భవిష్యత్‌లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటారన్నారు. అనంతరం శిబిరానికి హాజరైన వారికి మంత్రి, జిల్లా ప్రత్యేకాధికారి, కలెక్టర్ కేస్‌షీట్స్ అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ, సర్పంచ్ వెంకటరమణయ్య, ఎంపీటీసీ సభ్యుడు కె.రామిరెడ్డి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రమేష్‌నాథ్, డీఎంహెచ్‌ఓ పెంచలయ్య, డిప్యూటీ కలెక్టర్ చినఓసులేసు, కోనం చినబ్రహ్మయ్య, ఐసీడీఎస్ పీడీ హేనా సుజన్, జిల్లా వ్యవసాయాధికారి సుధాకర్‌రాజు, తహసీల్దార్ వీరవసంతరావు, ఎంపీడీఓ నగేష్‌కుమారి పాల్గొన్నారు.
జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా
గ్రామాలకు వైద్యనిపుణులు
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి
కాకాణి గోవర్ధన్‌రెడ్డి