కావలి: పట్టణంలో టీడీపీ నాయకులు మారణా యుధాలు చేత పట్టి నడిరోడ్డుపై తన్నుకుంటూ, దుర్భాషలాడుకున్నారు. శనివారం మధ్యాహ్నం పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్దే ఇరువర్గాల వారు బాహాబాహీకి దిగారు. పరస్పరం దాడులు, ప్రతి దాడులు చేసుకున్నారు. ఒక వర్గానికి కావలి పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు నాయకత్వం వహిస్తుండగా, మరొక వర్గానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు నాయకుడు. ఈ రెండు వర్గాలు గత కొన్ని నెలల్లో ఇలా రోడ్డుపై కొట్లాడుకోవడం ఐదోసారి ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. టీడీపీ వర్గాల కథనం మేరకు.. పార్టీలో మలిశెట్టి వెంటేశ్వర్లు ఆధిపత్యాన్ని ప్రశ్నించే విధంగా బాబురావు వ్యవహరిస్తుండగా, మలిశెట్టి కూడా ఆయనకు పార్టీలో చెక్ పెట్టే విధంగా పావులు కదుపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా నేరుగా మలిశెట్టి వెంకటేశ్వర్లు, జ్యోతి బాబురావు రోడ్డుపైనే బూతులు తిట్టుకుంటూ కొట్టుకుని చొక్కాలు చింపుకున్నారు. అప్పట్నుంచి వారిద్దరి నడుమ విభేదా లు ముదిరి పాకానపడ్డాయి. కాగా మలిశెట్టి వెంకటేశ్వర్లు భార్య విజయలక్ష్మి మాజీ కౌన్సిలర్ కావడంతో ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్నారు. శుక్రవారం జరిగిన పార్టీ కార్యక్రమంలో తనతో పాటు ఉన్న మహిళలను జ్యోతి బాబురావు జుగుప్సాకరంగా మాట్లాడాడని విజయలక్ష్మి ఆరోపణలు చేసింది. ఈ అంశంపై పార్టీ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడుకు ఫిర్యాదు చేసేందుకు పార్టీ ఆఫీస్‌కు వెళితే బాబురావు తన అనుచరులతో మారణాయుధాలతో దాడులు చేయించాడని మలిశెట్టి వెంకటేశ్వర్లు వర్గం కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మలిశెట్టి భార్య విజయలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికి బాబురావు ఐదుసార్లు తమపై దాడులు చేశాడని, ఈ విషయాన్ని మాలేపాటి అంగీకరించాడని చెప్పారు. ఇకనైనా ఆయనపై చర్యలు తీసుకోకపోతే తాము ఎంత దూరమైనా పోతామని ఆమె తేల్చి చెప్పారు. ఇక జ్యోతి బాబురావు కూడా మలిశెట్టి వర్గంపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించే అలవాటు ఉన్న మలిశెట్టి వెంకటేశ్వర్లుకు తాను అడ్డంగా ఉన్నాని తనపై కోపమన్నారు. ఎన్నికలు వస్తుండడంతో తనను పార్టీలో లేకుండా చేయాలని కుట్రలు పన్ని, చంపేయాలని పథకం రచించాడని ఆరోపించారు. టీడీపీ ఇన్‌చార్జి మాలేపాటి తనను పార్టీ కార్యాలయం గదిలోకి తీసుకెళ్లి తాళం వేయడంతో బతికానని, లేకపోతే ఈ రోజే చంపేసి ఉండేవారని పేర్కొన్నారు. కాగా ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసినట్లు కావలి వన్ టౌన్ సీఐ కే శ్రీనివాసరావు తెలిపారు.
టీడీపీ ఆఫీస్ బయటే పరస్పరం దాడులు
ఇరువర్గాలు ఒకరిపై ఒకరు
పోలీసులకు ఫిర్యాదులు
తమకు ప్రాణహాని ఉందన్న
ఒక వర్గం నాయకుడు
కేసులు నమోదు చేసిన పోలీసులు