నెల్లూరు(క్రైమ్): జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పోలీస్ గస్తీ తగ్గుముఖం పట్టింది. దొంగలు అందినకాడికి దోచేస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా చోరీలకు తెగబడుతున్నారు. పగలు రెక్కీ చేస్తున్నారు. ఆ సమయంలో తాళం వేసిన ఇల్లు కనిపిస్తే రాత్రి వెళ్లి దోచేస్తున్నారు. ఒంటరి వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. మూడునెలల వ్యవధిలో దుండగులు సుమారు 398 సవర్ల బంగారు ఆభరణాలను, ఇంకా నగదు, వజ్రాలు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. దీంతో కొందరు పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో 54 పోలీసుస్టేషన్లు, 12 సర్కిల్స్ ఉన్నాయి. వాటి పరిధిలోని ఏదో ఒక ప్రాంతంలో రోజూ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. చోరీల నియంత్రణలో కొందరు పోలీసులు నామమాత్రం చర్యలకు పరిమితమయ్యారనే విమర్శలున్నాయి. గతనెలలో బాలాజీనగర్‌లో ఓ వృద్ధురాలిని చంపుతామని బెదిరించి సుమారు ఎనిమిది సవర్ల బంగారు ఆభరణాలను దోచుకెళ్లగా.. రెండురోజుల క్రితం నాగేంద్రనగర్‌లో ఇల్లు అద్దెకు కావాలని ఇద్దరు యువకులు ఇంట్లోకి ప్రవేశించి వృద్ధురాలిపై దాడిచేసి సుమారు మూడున్నర సవర్ల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. దీనిని బట్టి చూస్తే పక్కాగా రెక్కీవేసి దోపిడీలకు పాల్పడుతోన్నట్లు తెలుస్తోంది. ఇటీవల నెల్లూరులో ఓ చిన్నారని కిడ్నాప్ చేసి ఒంటిపైనున్న ఆభరణాలు దోచుకెళ్తున్నారు. ఇక రౌడీషీటర్లు కత్తులు చూపించి చంపుతామని బెదిరించి అందినకాడికి దోచుకున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.
చర్యలు అంతంతమాత్రమే
దొంగతనాలను కట్టడి చేయాలని ఎస్పీ విజయారావు ప్రతి సమావేశంలో చెబుతూనే ఉన్నారు. అయితే కొందరు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి. చోరీ సొత్తును స్వాధీ నం చేసుకోవడంలో పలువురి పనితీరు అంతంతమాత్రంగానే ఉంటోంది. శివారు ప్రాంతాల్లో, లాడ్జీల్లో దుండగులు మకాంవేసి యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతున్నారు. గతనెలలో ఓ వ్యక్తి లాడ్జీలో ఉంటూ రెక్కీ వేసి విశ్రాంత అధికారి ఇంట్లో చోరీకి పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. రోజూ సాయంత్రం 5 నుంచి ఏడు గంటల వరకు నిర్వహిస్తున్న విజిబుల్ పోలీసింగ్ కేవలం వాహనదారులపై ఫైన్లకే పరిమితమైందన్న ప్రచారం ఉంది.
సీసీఎస్ ఎక్కడ?
జిల్లాలో చోరీలు.. దోపిడీలు ఎక్కడ జరిగినా సీసీఎస్ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి ఎవరు చేశారు? ఏ ముఠా ఈ తరహా నేరాలకు పాల్పడే అవకాశం ఉందని వెంటనే చెప్పేవారు. రోజుల వ్యవధిలోనే కేసులను ఛేదించేవారు. జిల్లా సీసీఎస్‌కు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. గతేడాది అనేక క్లిష్టతరమైన కేసులను ఛేదించి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నేరాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
‘దొంగతనాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టండి. పాతనేరస్తులతోపాటు జైలు నుంచి విడుదలైన వారి కదలికలపై నిఘా ఉంచండి. వాహన తనిఖీలు ముమ్మరం చేయండి. దొంగతనాల కట్టడితోపాటు చోరీ సొత్తు రికవరీపై దృష్టి సారించండి’ అని పదేపదే జిల్లా పోలీస్ బాస్ హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కొందరు సిబ్బంది పనితీరులో మార్పురాకపోవడం దొంగలకు కలిసొస్తోంది.
ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు
న్యూ మిలటరీ కాలనీలో తండ్రి, కుమార్తెను నిర్బంధించి పదిన్నర సవర్ల బంగారు, రూ.4.50 లక్షల సొత్తు చోరీ చేశారు.
బీవీనగర్‌లో కృష్ణంరాజు అనే వ్యక్తి ఇంట్లో 28 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.80 వేలు, 1,300 గ్రాముల వెండి వస్తువులు అపహరించారు.
కోవూరులో బి.సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఇంట్లో దొంగలు సుమారు 40 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.3.5 లక్షల నగదను అపహరించుకెళ్లారు.
రెచ్చిపోతున్న దొంగలు
వృద్ధులే లక్ష్యంగా దోపిడీలు
కొందరు పోలీసుల తీరుపై విమర్శలు
ఎస్పీ ఆదేశాలను పట్టించుకోని వైనం
బాలాజీనగర్‌లో దోపిడీకి గురైన వృద్ధురాలి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీస్ (ఫైల్)


