Zaheer Khan Breakup Story: ఈశాతో సహజీవనం.. కానీ పెళ్లివరకు రాలేదు.. సాగరికను పెళ్లాడి..

Zaheer Khan Once Loved Isha Sharvani Breakup Marriage With Sagarika - Sakshi

పార్టనర్స్‌ ఫర్‌ లైఫ్‌

 మొహబ్బతే

Zaheer Khan Love Life Marriage: జహీర్‌ ఖాన్‌.. క్రికెట్‌ను ఇష్టపడేవాళ్లు అమితంగా అభిమానించే ఫాస్ట్‌బాలర్‌ ‘కిస్నా.. ది వారియర్‌ పోయెట్‌’ హిందీ సినిమా ఫేమ్‌ ఈశా శర్వాణి ప్రేమలో క్లీన్‌బోల్డ్‌ అయిపోయాడు!! అయితే ఆ ప్రేమ.. పెళ్లిదాకా రాకుండానే బ్రేక్‌ అయింది. మరో బాలీవుడ్‌ తార, ‘చక్‌ దే ఇండియా ఫేమ్‌’ సాగరిక ఘాట్గే.. జహీర్‌ ఖాన్‌కు భార్య అయింది.  ఆ బ్రేకప్‌.. ఈ పెళ్లి .. రెండూ ఇవ్వాళ్టి ‘మొహబ్బతే’ కథనంలో.. 

దాదాపు పదహారేళ్ల కిందట.. ఒక ఫంక్షన్‌లో ఒకరికొకరు పరిచయం అయ్యారు జహీర్, ఈశా. ఆ రోజు నుంచే మంచి స్నేహితులుగా మారారిద్దరూ. ప్రేమెప్పుడూ ఫ్రెండ్‌షిప్‌తోనే మొదలవుతుంది. ఈ ఇద్దరి స్నేహం కూడా ప్రేమైంది నెమ్మదిగా. ఒకరోజు జహీర్‌ చెప్పాడు ఈశాతో.. ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అని. ఈశాలో సంబ్రమాశ్చర్యం. నిజానికి ఆ మాట తానూ చెప్పాలనుకుంది.

ఆ తీపి కబురు జహీర్‌ నోటివెంట రావడంతో వెంటనే ఓకే చెప్పేసింది. అప్పటి నుంచి ఆ ప్రేమ క్రికెట్‌ స్టేడియంలో జహీర్‌ను ప్రోత్సహించే ఈశా థమ్సప్స్‌లో.. అతన్ని ప్రశంసించే ఆమె చప్పట్లలో.. ఉత్సాహపరచే కేరింతల్లో.. ఈశా షూటింగ్‌ ప్యాకప్‌ అయ్యాక ఇద్దరూ కలసి చేసే డిన్నర్‌ డేట్స్‌.. హ్యాంగవుట్స్‌లలో కనిపించేది. తెల్లవారి మీడియాలో ప్రచురణ అయ్యేది.. ప్రసారమయ్యేది. 

సహజీవనం..
‘చోరీ చోరీ ఛుప్‌ ఛుప్‌ కే.. ఎంతకాలమని ఉంటాం? మన గురించి మనమే మీడియాలో ఎన్నని రూమర్లను కంటాం.. వింటాం? చలో కలసి ఉందాం’ అనుకున్నారు. ఒకే ఇంట్లో కలసి ఉండడం మొదలుపెట్టారు. అలా వాళ్ల అనుబంధానికి అధికారతను అపాదించుకున్నారు. వాళ్లనుకున్నట్లుగా వదంతులకు చెక్‌ పడలేదు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొత్త రూమర్లు ప్రారంభమయ్యాయి. 2011 వరల్డ్‌ కప్‌ సమయంలో ఇండియా ఆడే మ్యాచ్‌ల పట్ల క్రికెట్‌ అభిమానులు ఎంత ఉత్కంఠభరితంగా ఉన్నారో  ఈ జంట పెళ్లి రూమర్‌ పట్లా అంతే ఉత్కంఠతతో ఎదురు చూశారు.

వాళ్లందరినీ నిరాశపరుస్తూ జహీర్, ఈశా తమ ప్రేమానుబంధం నుంచి బయటకు వచ్చారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు కలసి నడిచిన ఆ ప్రయాణాన్ని పెళ్లి పీటల మీదకు చేర్చకుండానే రద్దు చేసుకున్నారు. బ్రేకప్‌కు కారణమేంటో ఇద్దరూ చెప్పలేదు. మీడియా ఎంత ప్రశ్నించినా మౌనంతో దాటవేశారే కానీ ఇద్దరిలో ఎవరూ పెదవి విప్పలేదు. ఈశానే తర్వాతెప్పుడో ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఔను మేమిద్దరం విడిపోయాం. అయినా జహీర్‌ నాకెప్పటికీ మంచి స్నేహితుడే’ అని చెప్పింది. 

సాగరిక కలిసింది.. 
భగ్న ప్రేమ జహీర్‌ను బాగానే బాధించింది అని చెప్తారు అతని సన్నిహితులు. అందులోంచి బయటపడడానికి క్షణం తీరికలేకుండా గడపడం మొదలుపెట్టాడట. క్రికెట్‌తోపాటు ఫ్రెండ్స్‌తో పార్టీలు.. అవుటింగ్‌లు అతని షెడ్యూల్‌లో భాగమైపోయాయి. సరిగ్గా  ఆ సమయంలోనే బాలీవుడ్‌లో మంచి బ్రేక్‌ కోసం చూస్తోంది సాగరిక ఘాట్గే. ఈ ఇద్దరూ తమ కామన్‌ ఫ్రెండ్‌ ఇంట్లో ఒకరికొకరు తారసపడ్డారు. పరిచయాలయ్యాయి. సాగరిక మాట తీరుకు ముచ్చటపడ్డాడు జహీర్‌.

ఆమె నవ్వు ఆమెతో స్నేహం పెంచుకునేలా ఆకర్షించింది అతణ్ణి. అందుకే తక్కువ కాలంలోనే మంచి స్నేహితులైపోయారిద్దరూ. ఫ్రెండ్స్‌ సర్కిల్లో కలుసుకునే .. ఫ్రెండ్స్‌ గ్రూప్స్‌తో అవుటింగ్స్‌కి వెళ్లే ఈ ఇద్దరూ క్రమంగా ఇద్దరూ కలసుకోవడం.. ఇద్దరే హాలిడేస్‌ను ఆస్వాదించడం మొదలుపెట్టారు. అలా ప్రేమలో పడిపోయారు. యువరాజ్‌ సింగ్‌ పెళ్లికి జంటగా హాజరై తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు జహీర్, సాగరిక.

తర్వాత వాళ్ల ప్రేమ గురించి జహీర్‌.. ట్విట్టర్‌లోనూ పోస్ట్‌ చేశాడు. జీవితమంతా సాగరిక చెంతే గడపాలని నిర్ణయించుకున్నాడు అతను. సాగరికతో నిశ్చితార్థం చేసుకున్నాడు. అప్పుడు సాగరికా సోషల్‌ మీడియాలో తన ప్రేమను ప్రకటించింది.. తన నిశ్చితార్థపు ఫొటోను పోస్ట్‌ చేస్తూ పార్టనర్స్‌ ఫర్‌ లైఫ్‌ హ్యాష్‌ ట్యాగ్‌ ఎంగేజ్డ్‌ అనే క్యాప్షన్‌తో. 2017, నవంబర్‌ 23న ఆ జంట తమ ప్రేమను పెళ్లితో స్థిరపర్చుకుంది. 
-ఎస్సార్‌ 

చదవండి: Ashes: 77 బంతుల్లో 12 ... 207 బంతుల్లో 26 పరుగులు.. స్టోక్స్‌, బట్లర్‌ పాపం..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top