
న్యూఢిల్లీ: భారత లెగ్‌స్పిన్నర్ యుజువేంద్ర చహల్, ధనశ్రీ వర్మ ఇటీవలే అధికారికంగా విడిపోయారు. అయితే విడాకులకు ముందు తాను తీవ్ర మానసిక వేదనను అనుభవించానని చహల్ చెప్పాడు. కొందరు తనను మోసగాడిగా చిత్రీకరించారని, తాను ఎప్పుడూ మోసం చేయలేదని...తాను ప్రేమించిన వ్యక్తి పట్ల విధేయతతోనే ఉన్నానని అతను పేర్కొన్నాడు. ‘నా విడాకుల తర్వాత నన్ను కొందరు మోసగాడు అన్నారు. కానీ నేను జీవితంలో ఎవరినీ మోసం చేయలేదు. నేను ఇష్టపడిన వ్యక్తి కోసం ఎంతో ఎక్కువ విధేయతను ప్రదర్శించాను. మనసారా ప్రేమించాను’ అని చహల్ వ్యాఖ్యానించాడు.
ధనశ్రీతో విడాకుల దాకా పరిస్థితి వచ్చినప్పుడు మానసికంగా బాగా దెబ్బ తిన్నానని అతను గుర్తు చేసుకున్నాడు. ‘నేను ఎలాంటి వేదనను అనుభవించానో నా సన్నిహితులకు బాగా తెలుసు. జీవితం పట్ల అలసిపోయినట్లు అనిపించింది. రోజులో రెండు గంటలు మాత్రమే పడుకుంటే రెండు గంటల పాటు ఏడుస్తూనే ఉండేవాడిని. ఇది దాదాపు నలభై రోజులు సాగింది. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించా’ అని ఈ స్పిన్ బౌలర్ వెల్లడించాడు.
అధికారికంగా విడాకులు తీసుకునే వరకు బయటపడవద్దని...అప్పటి వరకు కలిసే ఉన్నట్లుగా బయట కనిపించేందుకు తాము ప్రయతి్నంచినట్లు అతను చెప్పాడు. మరో వైపు ఇతర అమ్మాయిలతో తనకు ఏదో బంధం ఉన్నట్లుగా వచి్చన వదంతులు మరింతగా బాధపెట్టాయని చహల్ వివరించాడు. ‘ఎవరితోనైనా కనిపిస్తే చాలు సంబంధం అంటగట్టేస్తూ వచ్చారు. నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. మహిళలను ఎలా గౌరవించాలో నాకు తెలుసు’ అని చహల్ చెప్పాడు. చహల్ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో నార్తాంప్టన్‌షైర్ తరఫున ఆడుతున్నాడు.