గోల్ఫ్‌తో ఎంతో ప్రయోజనం: యువీ | Yuvraj participated in the jersey launch of the 10 IGPL franchises | Sakshi
Sakshi News home page

గోల్ఫ్‌తో ఎంతో ప్రయోజనం: యువీ

Apr 3 2026 3:49 AM | Updated on Apr 3 2026 10:30 AM

Yuvraj participated in the jersey launch of the 10 IGPL franchises

న్యూఢిల్లీ: గోల్ఫ్‌ ఆడటం ద్వారా ఒత్తిడి తగ్గుతుందని భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. టీమిండియా తరఫున టి20, వన్డే ప్రపంచకప్‌లు నెగ్గిన ఈ ఆల్‌రౌండర్‌... క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత గోల్ఫ్‌పై దృష్టి పెట్టాడు. క్రికెట్‌ కెరీర్‌కు ముందే గోల్ఫ్‌ ఆడి ఉంటే ఇంకా ఎంతో ప్రయోజనం చేకూరేదని... ఇప్పటికైనా యువ ఆటగాళ్లు క్రికెట్‌తో పాటు గోల్ఫ్‌ ప్రాక్టీస్‌ చేస్తే సేద తీరడంతో పాటు ఒత్తిడి దూరమవుతుందని యువీ హితవు పలికాడు. ప్రస్తుతం యువరాజ్‌ ఇండియన్‌ గోల్ఫ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐజీపీఎల్‌)కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. 

గురువారం ఐజీపీఎల్‌ 10 ఫ్రాంచైజీల జెర్సీ ఆవిష్కరణలో యువరాజ్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ... ‘క్రికెటర్లు క్రికెట్‌తో పాటు గోల్ఫ్‌ కూడా ఆడాలి. నేను ముందే ఈ పని చేయాల్సింది. అది నాకు క్రికెట్‌లో చాలా సహాయపడి ఉండేది. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా క్రికెటర్లు చిన్నప్పటి నుంచే గోల్ఫ్‌ ఆడుతారు. కానీ మనదేశంలో గోల్ఫ్‌ను కేవలం ఉన్నత వర్గాల క్రీడగా పరిగణిస్తారు. ఈ వైఖరిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. గోల్ఫ్‌ను పాఠశాల స్థాయికి తీసుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరూ ప్రతీ క్రీడను ప్రయత్నించాలని భావిస్తున్నాం.

మనదేశంలో క్రికెట్‌ అతిపెద్ద ఆట అని నాకు తెలుసు. కానీ గోల్ఫ్‌ కూడా ఉత్తేజకరమైన క్రీడే. అందరూ దీన్ని ప్రయత్నించాలి. దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్‌గా ఇతర క్రీడలకు కూడా నా వంతు సాయం చేయాలనుకుంటున్నా. ఐజీపీఎల్‌ లీగ్‌ గోల్ఫ్‌కు మరింత ప్రచారం కల్పిస్తోంది. దీని ద్వారా ఈ ఆట ఎక్కువ మందికి చేరువవుతుంది. ఇప్పుడు టీవీల్లో చూసే పిల్లలు... భవిష్యత్తులో గోల్ఫ్‌ ఆడేందుకు ఉత్సాహం చూపుతారు’ అని పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement