మెరిసిన జెమీమా, యస్తిక | Yastika Bhatia and Jemimah Rodrigues scored amazing half-centuries | Sakshi
Sakshi News home page

మెరిసిన జెమీమా, యస్తిక

May 30 2026 6:35 AM | Updated on May 30 2026 6:35 AM

Yastika Bhatia and Jemimah Rodrigues scored amazing half-centuries

తొలి టి20లో ఇంగ్లండ్‌పై భారత మహిళల జట్టు గెలుపు

చెమ్స్‌ఫోర్డ్‌: బ్యాటింగ్‌లో జెమీమా రోడ్రిగ్స్‌ (40 బంతుల్లో 69; 10 ఫోర్లు, 1 సిక్స్‌), యస్తిక భాటియా (40 బంతుల్లో 54; 9 ఫోర్లు, 1 సిక్స్‌)... బౌలింగ్‌లో నందని శర్మ (3/34) రాణించడంతో... ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 38 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 

భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు సాధించింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో... వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌లో టీమిండియాకు సారథ్యం వహించింది. ఇంగ్లండ్‌ బౌలర్‌ లారెన్‌ బెల్‌ (3/34) తొలి ఓవర్‌లోనే భారత ఓపెనర్లు స్మృతి (0), షఫాలీ వర్మ (2)లను అవుట్‌ చేసింది. 

7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్‌ను జెమీమా, యస్తిక ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 76 బంతుల్లో 126 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే మూడు బంతుల తేడాలో జెమీమా, యస్తిక నిష్క్రమించారు. చివర్లో దీప్తి శర్మ (13 బంతుల్లో 22; 4 ఫోర్లు) ధాటిగా ఆడటంతో భారత్‌కు గౌరవప్రద స్కోరు నమోదు చేసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 150 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. 

అమీ జోన్స్‌ (48 బంతుల్లో 67; 9 ఫోర్లు) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన చండీగఢ్‌ పేస్‌ బౌలర్‌ నందని శర్మ మూడు వికెట్లతో ఆకట్టుకుంది. క్రాంతి గౌడ్‌ రెండు వికెట్లు తీయగా... శ్రీచరణి, దీప్తి శర్మ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. జెమీమాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. సిరీస్‌లోని రెండో టి20 మ్యాచ్‌ ఈరోజు బ్రిస్టల్‌లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్‌ చానెల్‌లో, సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.   

Advertisement
 
Advertisement
Advertisement