నెటిజన్లకు దొరికిపోయిన బుమ్రా.. ఇలా ఐతే ఎలా?

WTC Final: Jasprit Bumrah Accidentally Wears Wrong Jersey - Sakshi

సౌథాంప్టన్‌: డబ్ల్యూటీసీ ఫైనల్లో ఖచ్చితంగా రాణిస్తాడని గంపెడాశలు పెట్టుకున్న టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. పేలవ ప్రదర్శనతో నిరాశపరచడమే కాకుండా మరో తప్పిదాన్ని చేసి నెటిజన్ల చేతిలో బలయ్యాడు. పేసర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయిన ఈ టీమిండియా పేస్‌ దళపతి.. ఇది చాల‌ద‌న్నట్లుగా ఐదో రోజు ఆట‌లో మరో పెద్ద పొర‌పాటు చేశాడు. ఫైన‌ల్ మ్యాచ్ కోసం ఐసీసీ ప్రత్యేకంగా త‌యారు చేయించిన జెర్సీని కాకుండా రెగ్యుల‌ర్ టీమిండియా జెర్సీతో ఆయన బ‌రిలోకి దిగి ఒక ఓవ‌ర్ మొత్తం అదే జెర్సీతో బౌలింగ్ చేశాడు. 

ఆ త‌ర్వాత త‌ప్పు తెలుసుకున్న బుమ్రా.. ఓవ‌ర్ల మ‌ధ్యలో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి కొత్త జెర్సీ వేసుకొని బరిలోకి దిగాడు. కాగా, ఐసీసీ ఈవెంట్లకు ఆటగాళ్ల జెర్సీల‌పై దేశం పేరు తప్పనిసరిగా మ‌ధ్యలో ఉంటుంది. స్పాన్సర్ పేరు స్లీవ్స్‌పై ముద్రించుకునేందుకు వారికి అనుమతి ఉంటుంది. అయితే, బుమ్రా వేసుకున్న జెర్సీ మ‌ధ్యలో భారత్ స్పాన్సర్ పేరు ఉంది. ఇది గమనించని బుమ్రా పొరపాటున రెగ్యులర్‌ టీమిండియా జెర్సీను ధరించడం సోషల్‌ మీడియాలో వైరలయ్యింది. నెటిజన్లు బుమ్రాను ఓ ఆటాడుకుంటున్నారు. అయ్యో బుమ్రా.. ఇలా ఐతే ఎలా..? ఏ జెర్సీ వేసుకోవాలో కూడా తెలియదా అంటూ తెగ ట్రోల్‌ చేశారు. మరికరైతే.. బుమ్రా ఇది పెద్ద బ్లండ‌ర్‌ అంటూ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే, ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఐదో రోజు భారత్‌ 32 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. ముందే ప్రకటించిన విధంగా రిజర్వు డే(ఆరో రోజు) ఆట కొనసాగనుంది. రిజర్వు డే మొత్తం గరిష్ఠ వ్యవధి కనీసం 330 నిమిషాలు లేదా 83 ఓవర్లుగా ఉంటుంది. ఐసీసీ రూల్స్‌ ప్రకారం ఆఖర్లో మరో గంట అదనపు సమయం ఉంటుంది. దీంతో మొత్తంగా ఆఖరి రోజు 93 ఓవర్ల ఆట సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. క్రీజ్‌లో పుజారా(12), కోహ్లీ(8) ఉన్నారు.

చదవండి: సౌథాంప్టన్‌: షమీ విశ్వరూపం.. మళ్లీ రిపీటయ్యేనా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top