
వచ్చే నెలలో (జూన్ 11) సౌతాఫ్రికాతో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు శుభవార్త అందింది. గాయం కారణంగా ఎనిమిది నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆ జట్టు యువ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌తో గ్రీన్ రెండు సెంచరీలు (112, 128) చేశాడు. ఈ టోర్నీలో గ్లోసెస్టర్‌షైర్‌కు ఆడుతున్న గ్రీన్ కెంట్ జట్టుపైనే రెండు సెంచరీలు చేశాడు.

తాజా ప్రదర్శనతో గ్రీన్ డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రత్యర్థి సౌతాఫ్రికాకు గట్టి వార్నింగ్ మెసేజ్ పంపాడు. గ్రీన్ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం కొద్ది రోజుల కింద ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్ నిమిత్తం గ్రీన్ కౌంటీ ఛాంపియన్‌షిప్ ఆడుతున్నాడు. అతనితో పాటు డబ్ల్యూటీసీ జట్టు సహచర సభ్యుడు మార్నస్ లబూషేన్ కూడా కౌంటీల్లో ఆడుతున్నాడు.
అయితే గ్రీన్ తరహాలో లబూషేన్‌కు సత్ఫలితాలు రాలేదు. లబూషేన్ ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లో 0, 4 పరుగులకు ఔటయ్యాడు. మిడిలార్డర్ బ్యాటర్ అయిన లబూషేన్ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓపెనర్‌గా మారే అవకాశం ఉందని తెలుస్తుంది. గ్రీన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్‌కు తుది జట్టులో ఆవకాశం కల్పించాలంటే లబూషేన్ ఓపెనర్‌గా ప్రమోట్ కాక తప్పదు. లబూషేన్.. వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజాతో ఇన్నింగ్స్ ప్రారంభిస్తే.. గ్రీన్, వెబ్‌స్టర్ ఇద్దరికీ తుది జట్టులో ఛాన్స్ దొరుకుతుంది.
ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించిన వెంటనే సౌతాఫ్రికా కూడా తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు టెంబా బవుమా సారధిగా వ్యవహరించనుండగా.. ఏకంగా ఆరుగురు పేసర్లు (కగిసో రబాడ, లుంగి ఎంగిడి, మార్కో జన్సెన్, వియన్ ముల్దర్, డేన్ ప్యాటర్సన్, కార్బిన్ బాష్) ఎంపికయ్యారు.
డబ్ల్యూటీసీ ఫైనల్-2025కి ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.
ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డాగెట్.
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహరాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జన్సెన్, కగిసో రబడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్.