మూడు వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల క్రికెట్ తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాల్టి నుంచి (ఏప్రిల్ 28) నుంచి ప్రారంభమైన టీ20 సిరీస్‌లోనూ బోణీ కొట్టింది. సిల్హెట్ వేదికగా ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
ఈ మ్యాచ్‌లో శ్రీలంక ప్లేయర్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసిన లంకేయులు, ఆతర్వాత బౌలింగ్‌లోనూ సత్తా చాటి బంగ్లాదేశ్‌ను 136 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమితం చేశారు.
లంక బ్యాటర్లలో ఇమేషా దులని (55), హర్షిత సమరవిక్రమ (61) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. కెప్టెన్ చమారీ 32 పరుగులతో పర్వాలేదనిపించింది. మిగతా ప్లేయర్లలో హాసిని పెరీరా 7, హన్సిమ కరుణరత్నే 2 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సల్తానా ఖాతూన్ 2, మరుఫా అక్తెర్, నహిద అక్తెర్ తలో వికెట్ తీశారు.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో షోర్నా అక్తెర్ (60) అర్ద సెంచరీతో రాణించగా.. ఆమెకు మరో ఎండ్ నుండి ఎవరి సహకారం లభించలేదు. దిల్హర అక్తెర్ 23, జుయారియా ఫిర్దోస్ 16, షిర్మన్ అక్తెర్ 1, కెప్టెన్ నిగార్ సుల్తానా డకౌట్, శోభన మోస్తరి 16, రబేయా ఖాన్ 6, సుల్తానా ఖాతూన్ 6 (నాటౌట్) పరుగులు చేశారు.
లంక బౌలర్లలో మల్కి మదారా, మిథాలీ అయోధ్య, చమారీ తలో 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను కట్టడి చేశారు. సుగంధిక, కవిష వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 ఇదే వేదికగా ఏప్రిల్ 30న జరుగనుంది.


