Womens Asia Cup 2022: ఫేవరెట్‌గా భారత్‌

Womens Asia Cup 2022: Harmanpreet Kaur will lead India in the Womens Asia Cup 2022  - Sakshi

నేటి నుంచి మహిళల ఆసియా కప్‌

శ్రీలంకతో భారత్‌ తొలి పోరు

మధ్యాహ్నం గం. 1:00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం  

సిల్హెట్‌ (బంగ్లాదేశ్‌): మహిళల ఆసియా కప్‌ టోర్నీని 2004 నుంచి 2018 వరకు ఏడు సార్లు నిర్వహించారు. ఇందులో ఆరు సార్లు భారతే విజేత. ఈ టోర్నీలో మన ఆధిక్యం ఎలా సాగిందో చెప్పేందుకు ఇది చాలు. వన్డే ఫార్మాట్‌లో నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన మన అమ్మాయిలు టి20 ఫార్మాట్‌లో రెండు సార్లు టైటిల్‌ నెగ్గారు. గత     టోర్నీలో మాత్రం అనూహ్యంగా ఫైనల్లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిపోయి మన జట్టు రన్నరప్‌తో సంతృప్తి చెందింది. ఇప్పుడు మరోసారి తమ సత్తా చాటి ట్రోఫీ గెలుచుకునేందుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన సిద్ధమైంది.

జట్టు తాజా ఫామ్, ఇటీవలి కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజత పతకం, ఇంగ్లండ్‌పై వన్డేల్లో సాధించిన విజయాలు సహజంగానే భారత్‌ను ఫేవరెట్‌గా చూపిస్తున్నాయి. నేడు జరిగే తొలి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్‌ ఆడుతుంది. ఆ తర్వాత టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌ల్లో వరుసగా మలేసియా (3న), యూఏఈ (4న), పాకిస్తాన్‌ (7న), బంగ్లాదేశ్‌ (8న), థాయ్‌లాండ్‌ (10న) జట్లతో తలపడుతుంది.

మొత్తం 7 జట్లు బరిలోకి దిగుతుండగా, భారత్‌తో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్,   శ్రీలంక, యూఏఈ, మలేసియా, థాయ్‌లాండ్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. యూఏఈ తొలిసారి ఆసియా కప్‌లో ఆడనుండగా, పురుషుల ఆసియా కప్‌లో రాణించిన అఫ్గానిస్తాన్‌కు మహిళల టీమ్‌ లేదు. రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌లో ప్రతీ జట్టు ఆరుగురు ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్‌లో తలపడుతుంది. టాప్‌–4 టీమ్‌లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్‌ 15న ఫైనల్‌ నిర్వహిస్తారు.  

జోరు మీదున్న టీమ్‌...
ఆసియా కప్‌ చరిత్రలో వన్డేలు, టి20లు కలిపి భారత్‌ 32 మ్యాచ్‌లు ఆడగా 30 మ్యాచ్‌లు గెలిచింది. ప్రస్తుత టీమ్‌ అదే తరహాలో పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉంది. హర్మన్‌ప్రీత్, వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన అద్భుత ఫామ్‌లో ఉండగా ఇప్పుడు జెమీమా రోడ్రిగ్స్‌ చేరికతో బ్యాటింగ్‌ మరింత    పటిష్టంగా మారింది. హేమలత, కీపర్‌ రిచా ఘోష్, దీప్తి శర్మ కూడా ధాటిగా ఆడగలరు. అయితే కొన్నాళ్ల క్రితం వరకు మెరుపు ఆరంభాలతో ఆకట్టుకున్న షఫాలీ వర్మ ఇటీవలి పేలవ ప్రదర్శనే జట్టును కాస్త ఆందోళనపరుస్తోంది.

అయితే ఆమెలో సామర్థ్యానికి కొదవ లేదని, ఒక్క ఇన్నింగ్స్‌  తో పరిస్థితి మారుతుందని కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌    అండగా నిలిచింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఒకే ఒక మ్యాచ్‌ ఆడిన ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి సబ్బినేని మేఘనకు ఎన్ని అవకాశాలు లభిస్తాయో చూడాలి. బౌలింగ్‌లో కూడా భారత్‌ చక్కటి ఫామ్‌లో ఉంది. పేసర్‌ రేణుకా సింగ్‌ ఠాకూర్‌  నిలకడగా రాణించడం జట్టుకు ప్రధాన బలంగా మారింది. మరో పేసర్‌ పూజ వస్త్రకర్‌ ఆమెకు అండగా నిలుస్తోంది. బంగ్లా గడ్డపై ప్రభావం చూపించగల స్పిన్‌ విభాగంలో మన బృందం మరింత పటిష్టంగా కనిపిస్తోంది. దీప్తి శర్మ, రాధా యాదవ్, ఆల్‌రౌండర్‌ స్నేహ్‌ రాణా సమష్టిగా జట్టును గెలిపించగలరు. గత ఆసియా కప్‌ ఫైనల్‌ ప్రదర్శనను పక్కన పెడితే మరోసారి భారత్‌కే టైటిల్‌ దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top