
ఆస్ట్రేలియాతో రెండో టీ20 మ్యాచ్‌లోనూ వెస్టిండీస్ (WI vs AUS)కు పరాభవమే ఎదురైంది. జమైకా వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై ఆసీస్ ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
సబీనా పార్కు మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా వెస్టిండీస్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లలో బ్రాండన్ కింగ్ హాఫ్ సెంచరీ(36 బంతుల్లో 51)తో రాణించగా.. కెప్టెన్ షాయీ హోప్ (9)తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ షిమ్రన్ హెట్‌మెయిర్ (14) ఫెయిలయ్యాడు.
రసెల్ సునామీ ఇన్నింగ్స్
రోస్టన్ చేజ్ (16), రోవ్‌మన్ పావెల్ (12)లతో పాటు షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (0) కూడా పూర్తిగా విఫలమయ్యాడు. ఇలాంటి దశలో విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ (Andre Russell) సునామీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. కేవలం 15 బంతుల్లోనే రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 36 పరుగులు సాధించాడు.
One Final Show from Dre Russ 🚀
A fitting last international innings from the West Indies all-rounder, showcasing the explosive talent that will be dearly missed by cricket fans everywhere 🥹#WIvsAus #AndreRussell pic.twitter.com/net68B3Woc— FanCode (@FanCode) July 23, 2025
మరోవైపు గుడకేశ్ మోటీ (9 బంతుల్లో 18 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి వెస్టిండీస్ 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా మూడు వికెట్లు తీయగా.. నాథన్ ఎల్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. డ్వార్షుయిస్‌కు ఒక వికెట్ దక్కింది.
ఆరంభంలోనే షాకులు
ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాకులు తగిలాయి. జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో మాక్సీ (12), అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (21) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఓపెనర్ల వైఫల్యం నేపథ్యంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
Rule 1: Don’t drop Josh Inglis 😤
Rule 2: Read Rule 1 again.
After two lives, he smashed 78* off 33 to bury West Indies. #AUSvWI pic.twitter.com/2tHN7yZiVn— FanCode (@FanCode) July 23, 2025
దంచికొట్టిన ఇంగ్లిస్, గ్రీన్
ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 33 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 78 పరుగులు సాధించాడు. ఈ వన్‌డౌన్ బ్యాటర్‌కు తోడుగా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కూడా అదరగొట్టాడు. 32 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదిన గ్రీన్.. 56 పరుగులతో ఇంగ్లిస్‌తో కలిసి అజేయంగా నిలిచాడు.
వీరిద్దరి మెరుపు అజేయ అర్థ శతకాల కారణంగా ఆస్ట్రేలియా.. 15.2 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్ల నష్టపోయి 173 పరుగులు చేసింది. తద్వారా విండీస్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి 2-0తో ఆధిక్యం పెంచుకుంది.
ఫేర్‌వెల్ మ్యాచ్‌లో ఓటమే
కాగా విండీస్ విధ్వంసకర వీరుడైన ఆండ్రీ రసెల్‌కు ఇది ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అతడు ధనాధన్ దంచికొట్టినా.. ఇంగ్లిస్, గ్రీన్‌ల కారణంగా ఓటమితో కెరీర్ ముగించాల్సి వచ్చింది.
కాగా మూడు టెస్టులు, ఐదు టీ20లు ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. టెస్టు సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసిన ఆసీస్.. టీ20 సిరీస్‌లో తొలి రెండు గెలిచి 2-0తో ముందంజలో ఉంది.
చదవండి: ఈ టెస్టులో ఆడిస్తే అతడికి అన్యాయం చేసినట్లే: అశ్విన్