Pele: 'పీలే'.. ఆ పేరు ఎలా వచ్చింది; అసలు పేరేంటి?

Why was-He Called Pele What Was His Actual Name Of-World Soccer Icon - Sakshi

ఫుట్‌బాల్‌లో ఒక శకం ముగిసింది. ఫుట్‌బాల్‌ ఆటకే వన్నె తెచ్చి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న పీలే 82 ఏళ్ల వయసులో డిసెంబర్‌ 29న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతని మరణం ఫుట్‌బాల్‌ అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. మరి మనం ఇంతలా ఆరాధిస్తున్న పీలే అసలు పేరేంటో తెలుసా? అదేంటి పీలే అసలు పేరు కాదా అనే అనుమానం రావొచ్చు. ఆయన అసలు పేరు పీలే కాదు.. అది కేవలం ముద్దుపేరు. 

పీలే అసలు పేరు 'ఎడిసన్‌ అరాంట్స్‌ డో నాసిమియాంటో'. పేరు పలకడమే కష్టంగా ఉంది కదూ.. కానీ పీలే అసలు పేరు మాత్రం ఇదేనండి. అమెరికా శాస్త్రవేత్త థామస్‌ అల్వా ఎడిసన్‌పై ప్రేమతో తండ్రి డోండిన్హో ఆ పేరు పెట్టుకున్నాడు. అయితే పాఠశాలలో స్నేహితులు పెట్టిన పీలే అనే పేరు ఆ తర్వాత స్థిరపడిపోయింది. అదే పేరుతోనే ఫుట్‌బాల్‌ ఆటలో చరిత్ర సృష్టించాడు. 

తన అసలు పేరు అర్థం తనకే తెలియదని పీలే ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. అయితే పీలే అనే పేరు మాత్రం ఎలా వచ్చిందనేది గుర్తుందన్నాడు. ''పోర్చుగీస్‌ భాషలో ఫుట్‌బాల్‌ను పాదంతో కిక్‌ కొడితే 'పీ' అని.. అదే సమయంలో నేను చేసిన తప్పులను ఎత్తిచూపుతూ పోర్చుగీసు భాషలో 'లే' అని పదం వాడారు. ఆ తర్వాత స్కూళ్లో అందరూ ''పీలే.. పీలే'' అని పిలిచేవారు. ఆ తర్వాత నా అసలు పేరు పోయి ''పీలే''గా సిర్థపడిపోయాను. కానీ పీలే అనే పేరు నాకు ఇష్టం ఉండదు. అసలు పేరు పలకడానికి కష్టంగా ఉన్నప్పటికి.. కుటుంబసభ్యులు, ఆప్తులు.. ''డీకో'' అని పిలుస్తుంటే చాలా ఆనందంగా ఫీలయ్యేవాడిని'' అని పేర్కొన్నాడు.

ఇక పీలే బాల్యం కడు పేదరికంలో సాగింది. తండ్రి ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ అయినప్పటికి సొంతంగా ఫుట్‌బాల్‌ కొనిచ్చేంత స్థోమత మాత్రం లేదు. దీంతో సాక్సుల్లో పేపర్లు నింపి బంతిలా తయారు చేసి ఫుట్‌బాల్‌ ఆడేవాడు. అలా చిన్నతనంలోనే ఫుట్‌బాల్‌పై మమకారం పెంచుకున్న పీలే తన బాల్యంలో చాలా స్థానిక ఫుట్‌బాల్‌ క్లబ్స్‌లో మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో రేడియం అనే స్థానిక ఇండోర్‌ ఫుట్‌బాల్‌(ఫుట్సల్‌) జట్టులో సభ్యుడయ్యాడు. అప్పటికి పీలే వయస్సు కేవలం 14 ఏళ్లు మాత్రమే.

14 ఏళ్ల వయసులోనే సీనియర్లతో ఆడడం గొప్ప విషయం అయినప్పటికి వారితో అతను ఎలా నెట్టుకురాగలడని అంతా సందేహపడ్డారు. ఇండోర్‌ ఫుట్‌బాల్‌లో ఆటగాళ్లు చాలా దగ్గరగా ఉంటారు. దీంతో మెరుపు వేగంతో ఆడాల్సి ఉంటుంది. ఇక్కడే పీలే ఫుట్‌బాల్‌ను ఎంత వేగంగా ఆడాలనేది నేర్చుకొని రాటుదేలాడు. అక్కడి నుంచి పీలే వెనుదిరిగి చూసుకోవాల్సి అవసరం రాలేదు. ఇక ఆ ఏడాది పీలే జట్టు ఇండోర్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ గెలుచుకుంది. టోర్నీలో మొత్తంగా పీలే 15 గోల్స్‌ చేయడం విశేషం.

ఆ తర్వాత పీలే చిన్ననాటి కోచ్‌ డి బ్రిటో.. అతన్ని శాంటోస్‌ సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌కు పరిచయం చేశాడు. ఆ జట్టు తరపున 15 ఏళ్ల వయసులో  ఆడిన తొలి మ్యాచ్‌లోనే గోల్‌ చేసి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత బ్రెజిల్‌ జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. అప్పటికే పీలే వయస్సు 16 సంవత్సరాలు మాత్రమే. ఇక పీలే తన మొదటి ఫిఫా వరల్డ్‌కప్‌ ఆడే సమయానికి వయస్సు 17 ఏళ్లు.

పట్టుమని 20 ఏళ్లు కూడా లేని ఒక కుర్రాడు ఆ వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన చేస్తాడని ఎవరూ ఊహించలేదు. పైగా టోర్నీలో అడుగుపెట్టే సమయానికి పీలే మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. కానీ నొప్పిని సైతం లెక్కచేయకుండా బరిలోకి దిగిన పీలే మొత్తం ఆరు గోల్స్‌ చేసి బ్రెజిల్‌ను తొలిసారి చాంపియన్స్‌గా నిలబెట్టాడు. ఆ తర్వాత 1962 ఫిఫా వరల్డ్‌కప్‌ బ్రెజిల్‌ గెలిచినప్పటికి పీలే పెద్దగా మెరవలేదు. కానీ కొన్ని మ్యాచ్‌ల్లో తన మార్క్‌ను చూపెట్టాడు.

ఇక ఎనిమిదేళ్ల తర్వాత అంటే 1970 ఫిఫా వరల్డ్‌కప్‌లో మాత్రం మరోసారి పీలే తన మ్యాజిక్‌ చూపెట్టాడు. అద్భుత ప్రదర్శనతో గోల్డెన్‌ బాల్‌ అవార్డును సొంతం చేసుకున్న పీలే ముచ్చటగా మూడోసారి బ్రెజిల్‌ను విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. పీలే తన కెరీర్‌ మొత్తంలో(ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కలిపి) 1363 మ్యాచ్‌ల్లో 1281  గోల్స్‌ చేయడం విశేషం. ఇక అధికారికంగా ఆడిన 831 మ్యాచ్‌ల్లో 767 గోల్స్‌ చేశాడు. ఇప్పటితరంలో గొప్ప ఆటగాళ్లుగా పేరు పొందిన మెస్సీ, రొనాల్డోలు ఇన్ని గోల్స్‌ చేయడానికి దాదాపు వెయ్యి మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది.

చదవండి: Pele: తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకున్నవేళ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top