పంజాబ్‌ ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌ ధరించడం వెనుక హృదయ విదారక కారణం | Know Reason Behind Why Are Punjab Kings Players Wearing Black Armbands In Match Against Rajasthan Royals? | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌ ధరించడం వెనుక హృదయ విదారక కారణం

Apr 28 2026 8:57 PM | Updated on Apr 29 2026 11:14 AM

Why Are Punjab Kings Players Wearing Black Armbands vs Rajasthan Royals?

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 28) రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాళ్లు నల్లటి ఆర్మ్‌ బ్యాండ్స్‌ ధరించి కనిపించారు. దీని వెనుక హృదయ విదారక కారణం ఉంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ నిన్న తన తల్లిని కోల్పోయారు.

ఇందుకు సంతాపంగా పంజాబ్‌ కింగ్స్‌ బృంద సభ్యులు మొత్తం నల్ల బ్యాండ్‌లు ధరించారు. ఈ మ్యాచ్‌ టాస్‌ సందర్భంగా పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఒమర్‌జాయ్‌ తల్లి మరణం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని పంజాబ్‌ కింగ్స్‌ తమ సోషల్‌మీడియా ఖాతాల్లో కూడా పోస్ట్‌ చేసింది.

"అజ్మతుల్లా ఒమర్జాయ్ తల్లి మరణం పట్ల మా ప్రగాఢ సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో పంజాబ్ కింగ్స్ కుటుంబం మొత్తం అతనితో పాటు అతని కుటుంబ సభ్యులకు అండగా ఉంటుంది" అని పేర్కొంది.

ఒమర్‌జాయ్‌ తన తల్లి అంత్యక్రియల నిమిత్తం స్వదేశానికి వెళ్లాడు. జట్టు కూర్పు సమస్యల కారణంగా ఒమర్‌జాయ్‌కు ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం కూడా రాలేదు. గత సీజన్‌లో పంజాబ్ తరఫున అతడు కొన్ని కీలక ప్రదర్శనలు చేశాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో తనదైన ముద్ర వేశాడు.

ఒమర్జాయ్ ఐపీఎల్ ప్రయాణం ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో సాగలేదు. 2024లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున అరంగేట్రం చేసిన అతడు, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌లో చేరాడు.

ఇదిలా ఉంటే, ముల్లాన్‌పూర్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న పంజాబ్‌ 18 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్‌ (59), ప్రియాంశ్‌ ఆర్య (29), కూపర్‌ కన్నోల్లీ (30), శ్రేయస్‌ అయ్యర్‌ (30) ఔట్‌ కాగా.. స్టోయినిస్‌ (24), సూర్యంశ్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో పంజాబ్‌ అజేయ జట్టుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement