ఐపీఎల్-2026 సీజన్ తుది దశకు చేరింది. మంగళవారం ధర్మశాల వేదికగా జరగనున్న క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు అమీతుమీ తెల్చుకునేందుకు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తుది పోరుకు అర్హత సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
అయితే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో ధర్మశాలలో 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని అక్యూవెదర్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి అని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు.
మ్యాచ్ రద్దు అయితే?
ఐపీఎల్ నిబంధనల ప్రకారం క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లకు ఎలాంటి 'రిజర్వ్ డే' లేదు. లీగ్ దశ మ్యాచ్‌లలో వర్షం కారణంగా అంతరాయం కలిగితే మ్యాచ్ ఫలితం తేల్చేందుకు అదనంగా కేవలం ఒక గంట సమయం మాత్రమే ఉంటుంది.
కానీ ప్లేఆఫ్స్ మ్యాచ్ విషయంలో మాత్రం అదనంగా రెండు గంటల సమయం కేటాయిస్తారు. కనీసం సూపర్ ఓవర్‌లో అయినా ఫలితాన్ని తేల్చేందుకు అంపైర్‌లు ప్రయత్నిస్తారు.అప్పటికి కూడా ఆట వీలుకాకపోతే మ్యాచ్‌ను అంపైర్‌లు రద్దు చేస్తారు. అదే జరిగితే లీగ్ దశ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉన్నందున ఆర్సీబీ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
అప్పుడు గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉంటుంది. కాగా లీగ్ దశ ముగిసేసరికి రెండు జట్లు చెరో 14 మ్యాచ్‌లు ఆడి, 18 పాయింట్లతో సమానంగా నిలిచాయి. అయితే గుజరాత్ టైటాన్స్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ సాధించడంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకుంది.
చదవండి: PAK vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా విధ్వంసకర వీరుడు


