ఇదేం పద్ధతి?.. శ్రేయస్‌ అయ్యర్‌పై మాజీ కెప్టెన్‌ ఫైర్‌ | What kind of rubbish thinking is this: Kris Srikkanth Slams Shreyas Iyer | Sakshi
Sakshi News home page

ఇదేం పద్ధతి?.. శ్రేయస్‌ అయ్యర్‌పై మాజీ కెప్టెన్‌ ఫైర్‌

May 14 2026 1:45 PM | Updated on May 14 2026 3:04 PM

What kind of rubbish thinking is this: Kris Srikkanth Slams Shreyas Iyer

ఐపీఎల్‌-2026 సీజన్‌ను ఘనంగా ఆరంభించింది పంజాబ్‌ కింగ్స్‌. వరుసగా ఆరు మ్యాచ్‌లలో గెలిచి టేబుల్‌ టాపర్‌గా చాన్నాళ్లపాటు కొనసాగింది. కానీ ఆ తర్వాత సీన్‌ రివర్స్‌ అయింది. వరుసగా నాలుగు ఓటములతో పంజాబ్‌ ప్రస్తుతం నాలుగో స్థానానికి పడిపోయింది.

ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే మిగిలిన మూడు లీగ్‌ మ్యాచ్‌లలో పంజాబ్‌ సత్తా చాటాల్సిందే. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడి ఓడిపోయిన పంజాబ్‌..‍ గురువారం ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తీరును విమర్శించాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో తమ ప్రధాన స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌తో ఒక్క ఓవర్‌ కూడా వేయించకపోవడాన్ని తప్పుబట్టాడు.

అతడితో  ఒక్క ఓవర్‌ కూడా వేయించరా?
ఈ మేరకు.. ‘‘పంజాబ్‌ తమ స్పిన్నర్లు చహల్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌లను తప్పనిసరిగా ఆడించాల్సింది. ఇలాంటి సమయంలోనే కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తమ బౌలర్లపై నమ్మకం ఉంచాలి. చహల్‌తో ఒక్క ఓవర్‌ కూడా వేయించకపోవడం ఏమిటి?

ఇదేం ఆలోచనా విధానం? ఇదేం పద్ధతి?.. చెత్త కెప్టెన్సీ.. ధర్మశాలలో ఫ్లాట్‌ వికెట్‌పై ప్రధాన స్పిన్నర్‌తో కనీసం రెండు ఓవర్లు కూడా వేయించరా?.. చహల్‌ గతంలో ఆర్సీబీ తరఫున ఫ్లాట్‌ వికెట్ల మీద చక్కగా బౌలింగ్‌ చేసి ఆ జట్టును గెలిపించాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ శ్రేయస్‌ అయ్యర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఢిల్లీతో మ్యాచ్‌లో పంజాబ్‌ బౌలర్ల ప్రదర్శన ఇలా
కాగా ధర్మశాలలో ఢిల్లీతో మ్యాచ్‌లో పంజాబ్‌ 210 పరుగులు సాధించింది. కానీ ఈ భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయి.. మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ పొదుపుగా బౌలింగ్‌ చేసి రెండు వికెట్లు తీయగా.. యశ్‌ ఠాకూర్‌ నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 55 పరుగులు ఇచ్చుకున్నాడు. అయితే, ఎట్టకేలకు రెండు వికెట్లు తీయగలిగాడు.

ఇక మార్కో యాన్సెన్‌ 4 ఓవర్ల కోటాలో 45 పరుగులు ఇచ్చి వికెట్‌ తీయలేకపోయాడు. మిగిలిన వాళ్లలో బెన్‌ డ్వార్షుయిస్‌ నాలుగు ఓవర్లలో 51 రన్స్‌ ఇచ్చి ఒక వికెట్‌.. మార్కస్‌ స్టొయినిస్‌ 3 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీయగలిగారు. చహల్‌ తుదిజట్టులో ఉన్నా బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదు. మరోవైపు హర్‌ప్రీత్‌ బ్రార్‌ను బెంచ్‌కు పరిమితం చేశారు.

చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. తొలి ప్లేయర్‌గా అరుదైన రి​కార్డు

Advertisement
 
Advertisement
Advertisement