WC 2023: ఈజీగా గెలుస్తామనుకున్నాం.. ఓడిపోవడానికి కారణం అదే: బట్లర్‌ | "Same Old Story": Buttler Very Disappointed With Another Batting Failure In WC 2023 - Sakshi
Sakshi News home page

#Josbuttler: సులువుగా గెలుస్తామనుకున్నాం.. మళ్లీ పాత కథే.. ఓడిపోవడానికి కారణం అదే: బట్లర్‌

Published Mon, Oct 30 2023 9:57 AM

WC 2023 Ind vs Eng Buttler Very Disappointed Same Old Story Aware Of That - Sakshi

ICC WC 2023- Ind Vs Eng- Jos Buttler Comments: టీమిండియా చేతిలో ఓటమి తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ అన్నాడు. స్వల్ప లక్ష్యాన్ని సులువుగా ఛేదిస్తామని భావిస్తే.. పాత కథే పునరావృతమైందని విచారం వ్యక్తం చేశాడు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారన్న బట్లర్‌.. బ్యాటర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారంటూ అసహనం వ్యక్తం చేశాడు.

వన్డే వరల్డ్‌కప్‌-2023లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ ఖాతాలో మరో పరాజయం చేరిన విషయం తెలిసిందే. టీమిండియా చేతిలో ఆదివారం నాటి మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన బట్లర్‌ బృందానికి ఈ టోర్నీలో ఇది ఐదో ఓటమి.

ఇంగ్లండ్‌ బౌలర్లు రాణించినా..
లక్నోలో రోహిత్‌ సేనను 229 పరుగులకే కట్టడి చేసినప్పటికీ.. భారత బౌలర్ల విజృంభణతో.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. ఇంగ్లండ్‌ ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో(14), డేవిడ్‌ మలన్‌(16) నిరాశ పరచగా.. జో రూట్‌, బెన్‌ స్టోక్స్ పూర్తిగా విఫలమయ్యారు.

ఈ ఇద్దరు ‘స్టార్‌’ బ్యాటర్లు డకౌట్లుగా వెనుదిరగడంతో ఇంగ్లండ్‌ కష్టాల్లో కూరుకుపోయింది. ఇక కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ సైతం కేవలం 10 పరుగులకే పరిమితం కాగా..  మొయిన్‌ అలీ 15 పరుగులు చేయగలిగాడు.

ఏడో నంబర్‌ బ్యాటర్‌ లియామ్‌ లివింగ్‌ స్టోన్‌ 27 పరుగులతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగతా వాళ్లలో ఎవరూ కూడా 20 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. దీంతో 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌట్‌ అయిన బట్లర్‌ బృందం మరో ఓటమిని మూటగట్టుకుంది.

ఓటమికి కారణం అదే
ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆడిన ఆరింట కేవలం ఒక్క విజయానికే పరిమితమై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. తద్వారా చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భాగమయ్యే అవకాశానికి దూరమయ్యే దుస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన బట్లర్‌.. తమ బౌలర్లు ఆరంభం నుంచే వికెట్లు తీసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టారని ప్రశంసించాడు.

కీలక బ్యాటర్లను త్వరగా పెవిలియన్‌కు పంపి తమకు శుభారంభం ఇచ్చారని పేర్కొన్నాడు. లక్నో 230 పరుగుల లక్ష్యం తమకు సులువైనదిగా అనిపించినా.. ఏ ఒక్క బ్యాటర్‌ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడంతో పరాజయం తప్పలేదని బట్లర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

అలా అయితే మరో పరాభవం
ఇక చాంపియన్స్‌ ట్రోఫీ 2025 క్వాలిఫికేషన్‌ సిస్టం గురించి మాట్లాడుతూ.. తమకు ఈ విషయం ముందే తెలుసన్న బట్లర్‌.. ఇక ముందు మరింత జాగ్రత్తగా ఆడతామని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌కు ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌, పాకిస్తాన్‌లతో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వీటిలో గెలిస్తేనే పాయింట్ల పట్టికలో టాప్‌-7లో నిలిచి చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కించుకుంటుంది. లేదంటే అంతే సంగతులు! 

చదవండి: WC 2023: అద్భుతం చేశారు.. మా బ్యాటింగ్‌ బాలేదు.. ఇదంతా వాళ్ల వల్లే: రోహిత్‌ శర్మ

 
Advertisement
 
Advertisement