ఈ తరం క్రికెటర్లలో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ జాబితాలో ఆటగాళ్ల పేర్లను వెలికితీస్తే అందులో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కచ్చితంగా ఉంటాడు. భారత క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ తర్వాత మూడు ఫార్మాట్లు (టెస్టు, వన్డే, టీ20) కలిపి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ చరిత్రకెక్కాడు. కోహ్లీ మూడు ఫార్మాట్లు కలిపి 559 మ్యాచ్‌ల్లో 28,215 పరుగులు సాధించాడు.
ఇందులో 85 సెంచరీలు, 146 హాఫ్ సెంచరీలున్నాయి. అలాంటి కోహ్లీతో కొన్నాళ్ల క్రితం వరకు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం పరుగుల పరంగా పోటీ పడ్డ మాట నిజమే. ఒక దశలో కోహ్లీ రికార్డులను కూడా బాబర్ బద్దలుకొట్టాడు. అయితే క్రమేపి బాబర్ ఆజం ఆటలో పదును తగ్గుతూ రావడం.. అదే సమయంలో కోహ్లీ వయసు పెరుగుతున్న కొద్ది బ్యాటింగ్‌లో జోరు కనబరచడం జరిగిపోయింది.
దీంతో బాబర్ ఆజం కోహ్లీకి ఆమడ దూరంలోనే నిలిచిపోయాడు. ఇప్పటివరకు బాబర్ ఆజం మూడు ఫార్మాట్లు కలిపి 15,647 పరుగులు సాధించాడు. ఇందులో 32 శతకాలు, 108 అర్థసెంచరీలున్నాయి. అయితే బాబర్ ఆజం టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. కానీ మూడు ఫార్మాట్లు కలిపి చూస్తే మాత్రం కోహ్లీ చేసిన పరుగుల్లో బాబర్ సగం కూడా చేయలేకపోయాడు.
ఈ నేపథ్యంలో పాక్ మాజీ పేసర్ తన్వీర్ అహ్మద్ కోహ్లీ కంటే బాబర్ ఆజం గొప్పోడంటూ ప్రశంసలు కురిపించడం ఆసక్తి రేపింది. 'విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్‌లో 675 పరుగులు సాదించాడు. కానీ అదే సమయంలో బాబర్ ఆజం పీఎస్ఎల్‌లో కోహ్లీ కంటే నాలుగు తక్కువ ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ 588 పరుగులు సాధించాడు.
మూడు ఫార్మాట్లు కలిపి చూస్తే కోహ్లీవి ఎక్కువ పరుగులు ఉండొచ్చు.. కానీ టీ20 క్రికెట్‌లో బాబర్‌ను మించిన బ్యాటర్ లేడు. పరుగులు సాధించడమే కాదు సెంచరీల విషయంలోనూ కోహ్లీపై బాబర్ ఆజందే పైచేయి. అదీగాక కోహ్లీ టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. కానీ బాబర్ ఇప్పటికీ మూడు ఫార్మాట్లు నిలకడగా ఆడుతున్నాడు. రాబోయే కాలంలో బాబర్ ఆజం టీ20 క్రికెట్‌లో ఉన్న రికార్డులన్నింటిని తన పేరిట లిఖించుకోనున్నాడు.' అని చెప్పుకొచ్చాడు.
అంతటితో ఊరుకోకుండా తన్వీర్ అహ్మద్ తన ఎక్స్ ఖాతాలో కింగ్ అనే పదానికి బాబర్ ఆజం సరైన నిర్వచనమని, కోహ్లీ దీనికి ఎంతమాత్రం సరిపోడంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేయడం కనిపించింది. 'గత పదేళ్లలో అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లీతో పోటీ పడి పరుగులు సాధించిన బాబర్ ఆజం నా దృష్టిలో గొప్ప క్రికెటర్. నేను అతడిని కింగ్ అని పిలుచుకుంటా' అని పేర్కొన్నాడు.
తన్వీర్ అహ్మద్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పరుగుల యంత్రంగా పేరున్న కోహ్లీని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోము.'..'టీమిండియా బ్యాటర్లు బాగా ఆడుతుంటే ఓర్వలేనితనం ఎలా ఉంటుందో పాక్ నిరూపించింది' టీమిండియా అంటే పాక్‌కు ఎప్పుడు కుళ్లే ఉంటుంది’ అని కామెంట్లు చేస్తున్నారు.
కోహ్లీతో సరితూగలేడు..
నిజానికి బాబర్ కంటే ఏడేళ్ల ముందే కోహ్లీ (2008లో) అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. బాబర్ అడుగుపెట్టే సమయానికే కోహ్లీ స్టార్ క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కోహ్లీ బ్యాటింగ్‌తో ఏమాత్రం సరితూగని బాబర్ ఆజంకు కలిసొచ్చే అంశం ఏదైనా ఉందంటే.. వయసు దృష్ట్యా అతడు మరో ఐదారేళ్లు క్రికెట్ ఆడే అవకాశముంది. అసలు కోహ్లీతో బాబర్ ఆజంను పోల్చలేము.
ఐసీసీ మేజర్ టైటిల్స్ సాధించకపోయినప్పటికీ, కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ను, ఆ తర్వాత ఇంగ్లండ్, సౌతాఫ్రికా దేశాల్లో నిలకడ విజయాలు అందుకుంది. మరోవైపు బాబర్ ఆజం కేవలం టీ20 ప్రపంచకప్పుల్లో మాత్రమే టీమిండియాను ఓడించాడు. అందులో కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా టీ20 ప్రపంచకప్‌లో 10 వికెట్ల తేడాతో పాక్ చేతిలో ఓడిపోవడమే బాబర్ ఆజంకు ఉన్న ఏకైక విజయం. అది మినహాయిస్తే కోహ్లీని ఏ విషయంలోనూ బాబర్ ఆజం మ్యాచ్ చేయలేడన్న సంగతి అందరికి తెలిసిందే.


