దడదడలాడించిన విరాట్‌ కోహ్లి | Virat Kohli Bruises Kagiso Rabada's Ego As Express Pace Gets Zero Respect | Sakshi
Sakshi News home page

దడదడలాడించిన విరాట్‌ కోహ్లి

Apr 30 2026 9:25 PM | Updated on Apr 30 2026 9:29 PM

Virat Kohli Bruises Kagiso Rabada's Ego As Express Pace Gets Zero Respect

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 30) జరుగుతున్న 42వ మ్యాచ్‌లో ఆర్సీబీ- గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఊహించిన విధంగానే గుజరాత్‌ బౌలర్లు తొలుత బౌలింగ్‌ చేస్తూ చెలరేగిపోయారు. ఫలితంగా ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. అయితే ఈ మధ్యలో ఆర్సీబీకి ఒకే ఒక ఊరట కలిగించే అంశం ఉంది. అదేంటంటే.. విరాట్‌ కోహ్లి. ఈ మ్యాచ్‌లో విరాట్‌ 13 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు.

చూడటానికి ఈ గణాంకాలు సాధారణంగానే ఉన్నా, ఈ ఇన్నింగ్స్‌ కెరీర్‌ తొలినాళ్లలో విరాట్‌లోని దూకుడుకు అభిమానులకు మరోసారి రుచి చూపించింది. ఈ ఇన్నింగ్స్‌లో విరాట్‌ గుజరాత్‌ బౌలర్‌ కగిసో రబాడపై విరుచుకుపడిన తీరు అమోఘంగా ఉండింది.

ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో రబాడ బౌలింగ్‌లో విరాట్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. స్టార్‌ బౌలర్‌ అన్న కనికరం కూడా లేకుండా రెచ్చిపోయాడు. వరుసగా 5 బౌండరీలు బాది చుక్కలు చూపించాడు.

పుల్ షాట్‌తో ఆరంభించిన కోహ్లీ.. కవర్స్, పాయింట్ ప్రాంతాల్లో అద్భుతమైన షాట్లతో బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో ఆ ఓవర్‌లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. ఐపీఎల్ కెరీర్‌లో కోహ్లీ ఒకే ఓవర్‌లో సాధించిన నాలుగో అత్యధిక స్కోరు ఇదే.

* 30 పరుగులు vs గుజరాత్ లయన్స్ (2016)
* 23 పరుగులు vs ఢిల్లీ (2013)
* 22 పరుగులు vs డెక్కన్ ఛార్జర్స్ (2010)
* 21 పరుగులు vs గుజరాత్ టైటాన్స్ (2026)

మరో అరుదైన ఘనత
ఐపీఎల్ చరిత్రలో క్రిస్‌ గేల్‌, షేన్‌ వాట్సన్‌ తర్వాత ఒకే ఓవర్‌లో ఐదు ఫోర్లు బాదిన మూడో ఆర్సీబీ బ్యాటర్‌గా విరాట్‌ రికార్డుల్లోకెక్కాడు.

రబాడ ఓవర్‌ తర్వాత సిరాజ్‌ వేసిన మరుసటి ఓవర్‌లోనూ ఓ సిక్సర్‌ బాదిన విరాట్‌.. రబాడ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో విరాట్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తెరపడింది. 

వాస్తవానికి ఈ సీజన్‌ ప్రారంభం నుంచే విరాట్‌ చాలా దూకుడుగా కనిపిస్తున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లో తన సహజ శైలికి భిన్నంగా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. సాధారణంగా విరాట్‌ ఎక్కువగా గ్రౌండ్‌ షాట్లు ఆడుతూ బౌండరీలు కొడుతుంటాడు. అయితే ఈ సీజన్‌లో అందుకు భిన్నంగా సిక్సర్లతో చెలరేగుతున్నాడు. ఈ సీజన్‌లో విరాట్‌ ఇప్పటికే 42 బౌండరీలతో పాటు 15 సిక్సర్లు బాదాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా చెలరేగిపోయారు. హోల్డర్‌ 3, సాయి సుదర్శన్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2 క్యాచ్‌లతో ఆర్సీబీని దెబ్బకొట్టారు. బౌలింగ్‌లో అర్షద్‌ ఖాన్‌ 3, హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2, సిరాజ్‌, రబాడ చెరో వికెట్‌ పడగొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌ (40) టాప్‌ స్కోరర్‌ కాగా.. విరాట్‌ 28, బేతెల్‌ 5, పాటిదార్‌ 19, జితేశ్‌ శర్మ 1, టిమ్‌ డేవిడ్‌ 9, కృనాల్‌ 4, షెపర్డ్‌ 17, వెంకటేశ్‌ అయ్యర్‌ 12, భువనేశ్వర్‌ కుమార్‌ 15 (నాటౌట్‌), హాజిల్‌వుడ్‌ డకౌటయ్యారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement