IND VS WI: టీమిండియాకు 1000వ వన్డే.. కోహ్లిని ఊరిస్తు‍న్న రికార్డు

Virat Kohli 6 Runs Away Achieving Huge ODI Milestone Vs WI 1st ODI - Sakshi

టీమిండియా మెషిన్‌గన్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. విండీస్‌తో జరగనున్న తొలి వన్డేలో ఆరు పరుగులు చేస్తే.. స్వదేశంలో వన్డేల్లో 5వేల పరుగులు మార్క్‌ను అందుకున్న రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. ఇంతకముందు బ్యాటింగ్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ మాత్రమే స్వదేశంలో 5వేల పరుగుల మార్క్‌ను అధిగమించాడు. సచిన్‌కు స్వదేశంలో 5వేల పరుగులు మార్క్‌ను అందుకోవడానికి 121 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి.

అయితే కోహ్లి విండీస్‌తో తొలి వన్డేలో 6 పరుగులు సాధిస్తే.. కేవలం 96 ఇన్నింగ్స్‌లోనే ఆ రికార్డును అందుకోనున్నాడు. ఇక కోహ్లి అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత స్వదేశంలో ఆడుతున్న తొలి సిరీస్‌ ఇదే కావడం విశేషం. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు స్వదేశంలో టీమిండియా న్యూజిలాండ్‌తో సిరీస్‌ ఆడింది. ఆ సమయంలో కోహ్లి టెస్టు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ప్రొటీస్‌ టూర్‌లో టెస్టు సిరీస్‌ కోల్పోయిన వెంటనే కోహ్లి తన టెస్టు కెప్టెన్సీ పదవికి గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుతం కోహ్లి టీమిండియా సీనియర్‌ బ్యాటర్‌గా కొనసాగుతూ బ్యాటింగ్‌పై పూర్తిస్థాయి దృష్టి సారించాడు.

ఇక టీమిండియా-వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా నేపథ్యంలో తొలి వన్డే రద్దు అవుతుందని ఊహాగానాలు వచ్చినప్పటికి బీసీసీఐ వాటిని కొట్టిపడేసింది.  అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఈ వన్డే మ్యాచ్‌ టీమిండియాకు 1000వ మ్యాచ్‌ కావడం విశేషం. క్రికెట్‌ చరిత్రలో వెయ్యెవ మ్యాచ్‌ ఆడుతున్న తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించనుంది.  దీంతో టీమిండియాకు ఈ మ్యాచ్‌ ప్రతిష్టాత్మకంగా మారింది. ఎలాగైనా మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో భోణి చేయాలని టీమిండియా భావిస్తోంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top