
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. ఇక్కడి జామియా మిలియా యూనివర్సిటీ మైదానంలో మణిపూర్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టు పరుగుల వరద పారించింది. ఏకంగా 282 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ సమర్థ్ వ్యాస్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 131 బంతులు ఆడిన సమర్థ్ 20 ఫోర్లు, 9 సిక్స్‌లతో సరిగ్గా 200 పరుగులు సాధించి అవుటయ్యాడు.
మరో ఓపెనర్ హార్విక్ దేశాయ్ (107 బంతుల్లో 100; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 36.3 ఓవర్లలో 282 పరుగులు జోడించడం విశేషం. సమర్థ్, హార్విక్ మెరుపు ఇన్నింగ్స్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగులు సాధించింది. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మణిపూర్‌ను సౌరాష్ట్ర ఎడంచేతి వాటం స్పిన్నర్ ధర్మేంద్రసింగ్ జడేజా తిప్పేశాడు. 32 ఏళ్ల ధర్మేంద్రసింగ్ 10 ఓవర్లు వేసి కేవలం 10 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. దాంతో మణిపూర్ 41.4 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది.