స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో టెస్ట్, వన్డే సిరీస్‌లు ముగిసిన అనంతరం టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా భారత్ ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. అయితే ఈ టూర్‌కు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంపికవుతాడా లేదా అనే చర్చ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో జోరందుకుంది.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ వైభవ్ సెలక్షన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్‌ను ఇప్పుడే విదేశీ గడ్డపై జరిగే సిరీస్‌లకు ఎంపిక చేయడం సరికాదని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు.
తొలుత ఐపీఎల్ తరహా పిచ్‌ల(ఉప ఖండ పరిస్థితులు)పై జరిగే అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లలో వైభవ్‌ను ఆడించాలని అతడు సూచించాడు.
"ప్రస్తుత భారత టీ20 జట్టులో సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు ఓపెనర్లుగా తమ స్ధానాలను సుస్ధిరం చేసుకున్నారు.. కచ్చితంగా వీరి తర్వాత స్ధానం వైభవ్ సూర్యవంశీదే. అయితే అతడిని భారత జట్టు ఎంపిక చేయాలనుకుంటే.. మొదట ఐపీఎల్ తరహా బ్యాటింగ్ అనుకూల పరిస్థితులన్న పిచ్‌లపై మాత్రమే ఆడించాలి. ఐపీఎల్ లాంటి పిచ్‌లపై జరిగే మ్యాచ్‌లలోనే అతడు అరంగేట్రం చేయాలి. అతడిని నేరుగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఐర్లాండ్ వంటి విదేశీ కండీషన్స్‌లో ఆడించడం సరైన నిర్ణయం కాకపోవచ్చు.
ఐర్లాండ్‌లో ఉండే పచ్చని పిచ్‌లు, ఇంగ్లండ్ తరహా వాతావరణంలో బంతి బాగా స్వింగ్ అవుతుంది. కెరీర్ ఆరంభంలోనే 15 ఏళ్ల కుర్రాడిని అలాంటి కఠినమైన పరిస్థితుల్లోకి నెట్టడం సరికాదు. ఇక ఓపెనింగ్ స్ధానం కోసం వైభవ్‌తో పాటు గిల్ కూడా పోటీలో ఉన్నాడు. కానీ ఈ రేసులో గిల్ ముందంజలో ఉన్నాడా లేక వైభవ్ సూర్యవంశీనా చెప్పడం చాలా కష్టం. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో వేచి చూడాలి
వైభవ్ భవిష్యత్తు గురుంచి..
టీ20ల్లో దుమ్ములేపుతున్న వైభవ్.. 'రెడ్-బాల్' క్రికెట్‌లో (టెస్టులు) ఎలా రాణిస్తాడో అని చాలామంది చర్చించుకుంటున్నారు. అయితే అతడి భవిష్యత్తు నిర్ణయించేది మనం కాదు. అది బీసీసీఐ బాధ్యత కూడా కాదు. అతడు ఒక స్వతంత్ర వ్యక్తి. అతడు తన కోచ్‌ల మార్గదర్శకత్వంలో ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. అతడు కేవలం టీ20ల్లో మాత్రమే పరిమితమై, ఒక స్టార్‌గా మిగిలిపోవాలంటే తన ఇష్టమది.
వైభవ్ 50 ఓవర్ల క్రికెట్ కూడా సరిపోతాడు. రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్-2023లో మొదటి 10 ఓవర్లలోనే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి, మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసేవాడు. వైభవ్ కూడా రోహిత్ మాదిరే దూకుడుగా ఆడి జట్టుకు శుభారంభం అందించగలడు. అవసరమైతే రోహిత్ కంటే వేగంగా ఆడగలడని అని స్పోర్ట్స్ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు.
చదవండి: మా ఇంట్లోనే ఉంటూ.. మా బిడ్డ ప్రాణం తీశాడు!


