మా ఇంట్లోనే ఉంటూ.. మా బిడ్డ ప్రాణం తీశాడు! | Para athlete held for Chirag Tyagi Elimination Did Jealousy destroy dreams | Sakshi
Sakshi News home page

మా ఇంట్లోనే ఉంటూ.. మా బిడ్డ ప్రాణం తీశాడు!

Jun 2 2026 12:11 PM | Updated on Jun 2 2026 1:08 PM

Para athlete held for Chirag Tyagi Elimination Did Jealousy destroy dreams

చిరాగ్‌ (PC: X)

శనివారం ఉదయం (మే 29).. త్యాగి కుటుంబమంతా చిరాగ్‌ కోసం ఎదురుచూస్తోంది. జపాన్‌ నుంచి తిరిగి వస్తున్న అతడికి ఘన స్వాగతం పలికేందుకు ఇంటిని అందంగా అలంకరించారు. పారా ఆసియా క్రీడలకు అర్హత సాధించిన అతడికి అభినందనలు తెలపాలని ఊరంతా ఎదురుచూస్తోంది.

కానీ చిరాగ్‌ మాత్రం ఇంటికి రానేలేదు. బదులుగా ఘజియాబాద్‌ పోలీసుల నుంచి అతడి కుటుంబానికి ఫోన్‌ కాల్‌ వచ్చింది. వెంటనే ఎంఎంజీ ఆస్పత్రికి రావాలని.. చిరాగ్‌ గాయపడ్డాడని వారికి చెప్పారు. కానీ అక్కడికి వెళ్లే సరికి అంతా అయిపోయింది.

భారత పారా అథ్లెట్‌ 24 ఏళ్ల చిరాగ్‌ త్యాగి శాశ్వతంగా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయాడు. పారా ఒలింపిక్స్‌లో పాల్గొనాలన్న కల నెరవేరకుండానే అతడు కన్నుమూశాడు. ఇందుకు అతడి స్నేహితుడు, తోటి పారా అథ్లెట్‌ యశ్‌ ఖటిక్‌ కారణమని త్యాగి కుటుంబం ఆరోపించింది.

వాళ్లే కారణం
ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఉత్తరప్రదేశ్‌ పోలీసులు సోమవారం నాటి ప్రెస్‌ మీట్‌లో కీలక విషయాలు వెల్లడించారు. ‘‘విచారణలో భాగంగా చిరాగ్‌ త్యాగి మరణానికి యశ్‌ ఖటిక్‌తో పాటు గగన్‌ త్యాగి కూడా కారణమని తేలింది. వీరితో పాటు అభయ్‌ అలియాస్‌ అభినవ్‌కు కూడా ఇందులో హస్తం ఉంది’’ అని పోలీసులు తెలిపారు.

విచారణలో భాగంగా నిందితుడు యశ్‌ ఖటిక్‌ తమకు చెప్పిన విషయాలను కూడా పోలీసులు ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు. ‘‘నేనూ.. చిరాగ్‌ ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో 400 మీటర్ల రేసు కోసం ప్రాక్టీస్‌ చేసేవాళ్లము. చిరాగ్‌ మాత్రమే ఆసియా క్రీడలకు ఎంపికయ్యాడు.

నాలో అభద్రతా భావం 
నిజానికి చిరాగ్‌ మాదిరే నాకూ కంటి సమస్య ఉంది. అయితే, నా మెడికల్‌ రిపోర్టును జర్మనీకి పంపించాల్సి ఉంది. కానీ చిరాగ్‌ దానిని నాశనం చేశాడు. దీంతో నేను ఆసియా క్రీడలకు సెలక్ట్‌ కాలేకపోయాను.

అంతేకాదు.. పరుగు పందెంలో ఎప్పుడూ చిరాగే గెలిచేవాడు. అతడు వరుసగా రెండు పతకాలు కూడా సాధించాడు. అతడి ఎదుగుదల నాలో అభద్రతా భావాన్ని పెంచింది. అతడి వల్ల నా కెరీర్‌ ప్రమాదంలో పడుతుందనే భయం వెంటాడింది.

అందుకే నా అసోసియేట్‌ గగన్‌ త్యాగితో కలిసి చిరాగ్‌ హత్యకు పథకం రచించాను. మాకు భికన్‌పూర్‌కు చెందిన అభయ్‌ పిస్టల్‌ తెచ్చి ఇచ్చాడు. మే 29న బెంగళూరు నుంచి చిరాగ్‌ తిరిగి వచ్చాడు. మే 30న ఘజియాబాద్‌కు టాక్సీలో పయనమయ్యాడు.

అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు
అప్పుడే మా ప్లాన్‌ ప్రకారం.. సాయి ఉప్‌వన్‌ దగ్గర చిరాగ్‌ త్యాగిని నేను తుపాకీతో చాలా దగ్గరి నుంచి కాల్చాను. అది అతడి తలకు తగిలింది. ఆ తర్వాత వెన్నులోనూ కాల్చాను. అతడు అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు.

మేము చిరాగ్‌ ఫోన్‌ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాము. అతడి సిమ్‌ కార్డు తీసి మురికికాలువలో పడేశాము. అతడి బ్యాంకు అకౌంట్‌ నుంచి 62 వేల రూపాయలు డ్రా చేసి.. మాకు పిస్టల్‌ అమ్మిన వ్యక్తికి ఇచ్చేశాము’’ అని నిందితుడు యశ్‌ ఖటిక్‌ చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

కాగా చిరాగ్‌, యశ్‌ ‘బ్లైండ్‌’ కేటగిరీలో పోటీల్లో పాల్గొంటున్నారని.. అయితే, చిరాగ్‌ పట్ల అసూయతోనే యశ్‌ ఈ పని చేసినట్లు వెల్లడించాడని పోలీసుల విచారణలో తేలింది. కాగా చిరాగ్‌ అంకుల్‌ ప్రవీణ్‌ రాజ్‌ త్యాగి ఈ ఘటన గురించి మాట్లాడుతూ..

‘‘చిన్నప్పటి నుంచి ఒలింపిక్స్‌ లక్ష్యంగా చిరాగ్‌ ముందుకు సాగాడు. జూడోలో కూడా అతడికి ప్రవేశం ఉంది. అయితే, స్ప్రింటర్‌గా రాణించడంపైనే దృష్టి పెట్టాడు.

మా ఇంట్లోనే ఉంటూ.. మా బిడ్డ ప్రాణం తీశాడు!
ఈ క్రమంలో ఎన్నో త్యాగాలు చేశాడు. అయితే, రోజురోజుకీ అతడి కంటిచూపు మందగించింది. ఎన్ని ఆస్పత్రులకు తిప్పినా ఫలితం లేకుండా పోయింది. అప్పుడే పారా క్రీడల రూపంలో మాకు మరో మార్గం దొరికింది. అక్కడైనా తనను తాను నిరూపించుకోవాలని చిరాగ్‌ పట్టుదలగా పనిచేశాడు.

అసలు యశ్‌ ఈ పని చేశాడంటే మేము నమ్మలేకపోతున్నాము. చిరాగ్‌కు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి రూ. 20 వేలు వస్తే అందులో 10 వేలు యశ్‌కే ఇచ్చేవాడు. అతడికి శిక్షణ కూడా ఇచ్చేవాడు. యశ్‌ను మేమెంతగానో నమ్మాము. మా కొడుకులాగే చూసుకున్నాము. మాతో పాటు మా ఇంట్లోనే ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు అసూయతో మా బిడ్డనే చంపేశాడు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement