భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్‌! | Vaibhav Sooryavanshi Gets Another Thumbs Up For India Debut In T20I Side | Sakshi
Sakshi News home page

భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్‌!

May 6 2026 2:39 PM | Updated on May 6 2026 2:42 PM

Vaibhav Sooryavanshi Gets Another Thumbs Up For India Debut In T20I Side

వెస్టిండీస్ దిగ్గజ బౌలర్, ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ భారత ద్వితీయ శ్రేణి టీ20 జట్టును ఎంచుకున్నారు. తన ఎంపిక చేసిన జట్టులో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి బిషప్‌ చోటు ఇచ్చారు.

ఐపీఎల్‌-2026లో అద్భుతంగా రాణిస్తున్న మరో రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌కు కాదని వైభవ్ వైపు ఆయన మొగ్గు చూపుడం గమనార్హం.వైభవ్ సూర్యవంశీతో పాటు మరో ఓపెనర్‌గా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఆయన ఛాన్స్ ఇచ్చారు.

ఈ బ్యాకప్ ఓపెనర్‌గా పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు చోటు దక్కింది. ఓ ఇంటర్వ్యూలో బిషప్ మాట్లాడుతూ.. "నా జట్టులో ముగ్గురు ఓపెనర్లను తీసుకుంటాను. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం లెఫ్ట్ హ్యాండర్‌గా వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేస్తాను. అతడు అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్దంగా ఉన్నాడని నేను నమ్ముతున్నాను" చెప్పుకొచ్చారు.

ఇక మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్‌, దేవ్‌దత్త్ పడిక్కల్‌, రజిత్ పాటిదార్ వంటి స్టార్ ప్లేయర్లకు బిషప్ అవకాశమిచ్చారు. ఆల్‌రౌండర్లగా కృనాల్ పాండ్యా, నితీశ్ కుమార్‌ల‌ను ఆయన ఎంచుకున్నారు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా ధ్రువ్‌ జురెల్‌కు ఛాన్స్‌ లభించింది.

ముఖ్యంగా 35 ఏళ్ల వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవడం విశేషం. దాదాపు మూడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న చాహల్‌ను, రవి బిష్ణోయ్‌ను పక్కన పెట్టి మరి ఛాన్స్‌ ఇచ్చారు. ఇక చివరగా ఫాస్ట్‌ బౌలర్ల విభాగంలో భువనేశ్వర్ కుమార్, మొహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి వారు ఉన్నారు.

ఐర్లాండ్‌ టూర్‌కు వైభవ్‌!
కాగా ఐపీఎల్‌-2026 సీజన్‌ తర్వాత భారత జట్టు ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌కు సీనియర్‌ ఆటగాళ్లకు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యువ ఆటగాళ్లు వైభవ్‌ సూర్యవంశీ, ప్రియాన్ష్‌ ఆర్యలకు సీనియర్‌ జట్టులో చోటు దక్కే అవకాశముంది. వైభవ్‌ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ.. 237.65 స్ట్రైక్ రేట్‌తో 404 పరుగులు చేశాడు.

ఇయాన్ బిషప్ ప్రత్యామ్నాయ భారత టీ20 జట్టు: శుభ్‌మన్ గిల్, వైభవ్ సూర్యవంశీ, దేవదత్ పడిక్కల్, శ్రేయాస్ అయ్యర్, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, నితీష్ రెడ్డి, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, మొహ్సిన్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు

 


 

Advertisement
 
Advertisement
Advertisement