బంగ్లా ప్లేయర్‌ తొలగింపు దురదృష్టకరం: ఐపీఎల్‌ చైర్మన్‌ | Unfortunate: IPL chairman breaks silence On Mustafizur release from KKR | Sakshi
Sakshi News home page

ముస్తాఫిజుర్‌ రహమాన్‌ తొలగింపు దురదృష్టకరం: ఐపీఎల్‌ చైర్మన్‌

Apr 3 2026 11:43 AM | Updated on Apr 3 2026 12:57 PM

Unfortunate: IPL chairman breaks silence On Mustafizur release from KKR

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 మినీ వేలంలో అమ్ముడుపోయిన ఏకైక బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌. మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) అతడిని రూ. 9.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. 

అయితే, భారత్‌- బంగ్లా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో కేకేఆర్‌ యాజమాన్యం, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

బంగ్లాదేశ్‌ ఆటగాడిని వెంటనే ఐపీఎల్‌ నుంచి తొలగించాలనే డిమాండ్లు వచ్చాయి. ఇందుకు తలొగ్గిన బీసీసీఐ.. ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను రిలీజ్‌ చేయాల్సిందిగా కేకేఆర్‌ను ఆదేశించింది. దీంతో అతడు ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌-2026 ఆడేందుకు భారత్‌కు రాలేమంటూ బంగ్లాదేశ్‌ టోర్నీ నుంచే తప్పుకొంది.

దురదృష్టకరం
ఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ను తొలగించడంపై ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ తొలిసారి స్పందించాడు. ఫైనాన్షియల్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘అదొక దురదృష్టకర సంఘటన అని చెప్పగలను. ఒక్కోసారి పరిస్థితులకు తగినట్లు నడుచుకోవాల్సి ఉంటుంది.

ఏదేమైనా ప్రభుత్వానికి క్రికెట్‌లో జోక్యం చేసుకోవాలనే ఆలోచన మాత్రం లేదు. ఎల్లవేళలా మాకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అయితే, ముందుగా చెప్పినట్లు కొన్నిసార్లు పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు.

ఏది జరిగినా మన మంచికే
పరిణామాలకు తగినట్లుగానే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏది జరిగినా మన మంచికే అన్న సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది’’ అని అరుణ్‌ ధుమాల్‌ చెప్పుకొచ్చాడు. 

కాగా ఐపీఎల్‌ నుంచి తొలగించిన తర్వాత ముస్తాఫిజుర్‌ రహమాన్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)లో ఆడేందుకు వెళ్లాడు. మరోవైపు.. పీఎస్‌ఎల్‌ను వీడి జింబాబ్వే పేసర్‌ బ్లెస్సింగ్‌ ముజర్‌బానీ కేకేఆర్‌లో ముస్తాఫిజుర్‌ స్థానాన్ని భర్తీ చేశాడు.

చదవండి: IPL 2026: ‘నేనైతే ఫుల్‌ హ్యాపీ’.. తెలుగు క్రికెటర్‌ భావోద్వేగం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement