కేకేఆర్‌ ఓడినా ఆ ఒక్క‌డు గెలిచాడు! | Who Is Blessing Muzarabani Shines In SRH Vs KKR 4 Wicket Haul | Sakshi
Sakshi News home page

IPL 2026: కేకేఆర్‌ ఓడినా ఆ ఒక్క‌డు గెలిచాడు!

Apr 3 2026 7:45 AM | Updated on Apr 3 2026 10:33 AM

Who Is Blessing Muzarabani Shines In SRH Vs KKR 4 Wicket Haul

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో కోల్‌కతా నైట్‌రైడ‌ర్స్ (కేకేఆర్‌) వ‌రుస‌గా రెండో ఓట‌మి న‌మోదు చేసుకుంది. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో మ్యాచ్‌లో ఛేద‌నలో మంచి ఆరంభం లభించిన‌ప్ప‌టికీ దానిని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో కేకేఆర్ బ్యాట‌ర్లు విఫ‌ల‌మ‌య్యారు. దీనికి తోడు టార్గెట్ ఎక్కువ‌గా ఉండ‌డం కూడా కేకేఆర్ కొంప‌ముంచింది. అయితే జ‌ట్టు ఓడినా ఒక్క ఆట‌గాడు మాత్రం గెలిచాడు. అత‌డే జింబాబ్వేకు చెందిన‌ బ్లెసింగ్ ముజ‌ర‌బానీ.

ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో మూడు ఓవ‌ర్లు వేసి 34 ప‌రుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయాడు. కానీ గురువారం ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో మాత్రం ముజ‌ర‌బానీ త‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. 4 ఓవ‌ర్లు వేసిన ముజ‌ర‌బానీ 41 ప‌రుగులిచ్చి 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

ఎకాన‌మీ ప‌రంగా చూసుకుంటే ఓవ‌ర్‌కు 10 ప‌రుగుల చొప్పున ఇచ్చిన‌ప్ప‌టికీ బ్యాటింగ్ పిచ్‌పై ముజ‌ర‌బానీ ప్ర‌ద‌ర్శ‌న తీసిపారేయ‌లేము. పైగా అత‌డు తీసిన నాలుగు వికెట్ల‌లో అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్‌, క్లాసెన్ వంటి విధ్వంస‌క‌ర బ్యాట‌ర్లు ఉన్నారు. ఈ ఐపీఎల్‌లో సికంద‌ర్ ర‌జా త‌ర్వాత జింబాబ్వే నుంచి ఆడుతున్న క్రికెట‌ర్ ముజ‌ర‌బానీ మాత్ర‌మే. మొద‌ట వేలంలో అమ్ముడుపోని ఆట‌గాడు ఇవాళ కేకేఆర్ మ్యాచ్ ఓడినా త‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో మాత్రం అభిమానుల మ‌నుసులు గెలుచుకున్నాడు.

వేలంలో అమ్ముడుపోలేదు..
జింబాబ్వే ఆట‌గాడు అయిన బ్లెసింగ్ ముజ‌ర‌బానీకి ఇదే తొలి ఐపీఎల్ సీజ‌న్‌.  రూ. 75 ల‌క్ష‌ల క‌నీస ధ‌ర‌తో వేలంలోకి దిగిన ముజ‌ర‌బానీని కొనుగోలు చేయ‌డానికి ఫ్రాంచైజీలు ఇష్ట‌ప‌డ‌లేదు. దీంతో అత‌డు అమ్ముడుపోని ఆట‌గాళ్ల జాబితాలో చేరిపోయాడు. అయితే అదృష్టం ముజ‌ర‌బానీని ముస్తాఫిజుర్ రెహ్మాన్ రూపంలో వెతుక్కుంటూ వ‌చ్చింది. 

బంగ్లాదేశ్‌లో హిందువుల‌పై దాడులు, ఇత‌ర కార‌ణాల రీత్యా బంగ్లా ఆట‌గాళ్ల‌ను ఐపీఎల్‌లో పాల్గొన‌కూడ‌దంటూ దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు జ‌రిగాయి. దీంతో బీసీసీఐ ఐపీఎల్‌లో ఆయా ఫ్రాంచైజీల్లో ఉన్న బంగ్లా ఆట‌గాళ్ల‌ను బ‌హిష్క‌రించాల‌ని సందేశాలు పంపింది. దీంతో కేకేఆర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జ‌ట్టు నుంచి విడుద‌ల చేసింది.

వెతుక్కుంటూ అవకాశం..
అత‌డి స్థానంలో నిఖార్సైన బౌల‌ర్ కోసం వెతికింది. ఈ నేప‌థ్యంలోనే అప్ప‌టికే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో జింబాబ్వే త‌ర‌ఫున 6 మ్యాచ్‌లాడిన బ్లెసింగ్ ముజ‌రబానీ 7.88 ఎకాన‌మీ రేట్‌తో 13 వికెట్లు ప‌డ‌గొట్టాడు. మొద‌ట అస‌లు వేలంలో అమ్ముడుపోని ఆట‌గాడిగా నిలిచిన ముజ‌ర‌బానీపై కేకేఆర్ క‌న్ను ప‌డింది. దీంతో ముస్తాఫిజుర్ స్థానంలో ముజ‌ర‌బానీని రీప్లేస్ చేస్తున్న‌ట్లు కేకేఆర్ యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది.

ఎవ‌రీ ముజ‌ర‌బానీ?
29 ఏళ్ల ముజ‌ర‌బానీ జింబాబ్వేలోని మురేవా అనే చిన్న ప‌ట్ట‌ణంలో జ‌న్మించాడు. ఏడేళ్ల ప్రాయంలో క్రికెట్‌లో ఓన‌మాలు నేర్చుకున్న ముజ‌రబానీకి అత‌ని హైట్ ప్ల‌స్ అయింది. 6 అడుగుల 8 అంగుళాల పొడ‌వు ఉండే ముజ‌రబానీ వేసే బౌన్స‌ర్లు బ్యాట‌ర్ల‌ను ఇబ్బంది పెడుతుంటాయి. 

అలా 2017లో జాంబాబ్వే మాజీ క్రికెట‌ర్ తెటెండా తైబు క‌ళ్ల‌లో ప‌డిన ముజ‌ర‌బానీ రైజింగ్ స్టార్స్ అకాడ‌మీలో మూడు నెల‌ల పాటు క‌ఠిన శిక్ష‌ణ తీసుకొని బౌలింగ్‌లో మ‌రింత రాటుదేలాడు. 2017లో జింబాబ్వే త‌ర‌ఫున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ముజ‌రబానీ ఇప్ప‌టివ‌ర‌కు 18 టెస్టుల్లో 67 వికెట్లు, 57 వన్డేల్లో 70 వికెట్లు, 88 టీ20ల్లో 105 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

మొత్తంగా అన్ని ఫార్మాట్లు క‌లిపి 243 వికెట్లు ప‌డ‌గొట్టిన ముజ‌ర‌బానీ జింబాబ్వే త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు.  ఇక 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో గ్రూప్ ద‌శ‌లో ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించ‌డంలో ముజ‌ర‌బానీదే కీల‌క‌పాత్ర‌. ఆ మ్యాచ్‌లో ముజ‌రబానీ 17 ప‌రుగుల‌కే 4 వికెట్లు తీసి ఆసీస్ ప‌త‌నాన్ని శాసించాడు. అంతేకాదు రిచ‌ర్డ్ న‌గ‌ర‌వా, సికంద‌ర్ ర‌జా త‌ర్వాత  జింబాబ్వే త‌ర‌ఫున టీ20ల్లో వంద వికెట్లు తీసిన  మూడో బౌల‌ర్‌గానూ ముజ‌ర‌బానీ నిలిచాడు.

మ్యాచ్ విష‌యానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 226 ప‌రుగులు చేసింది. అనంత‌రం బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 16 ఓవ‌ర్ల‌లో 161 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన నితీశ్‌కుమార్ రెడ్డి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

చదవండి: మూగబోయిన బ్యాట్‌.. విధ్వంస వీరుడికి ఏమైంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement