ట్రక్ డ్రైవర్ కొడుకు నుంచి ఆర్సీబీ క్రికెటర్‌గా | From Truck Driver Son To 5.2 Crore Worth IPL Star, Know About Mangesh Yadav Inspirational Life Journey In Telugu Ahead Of IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: ట్రక్ డ్రైవర్ కొడుకు నుంచి ఆర్సీబీ క్రికెటర్‌గా

Mar 26 2026 11:50 AM | Updated on Mar 26 2026 12:51 PM

Truck Drivers Son Mangesh Yadavs 5.2 Crore RCB Dream Comes True

అమ్మ మనకు జన్మనిస్తే.. నాన్న జీవితమిస్తాడు. తన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయడానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. తన నూరేళ్ల జీవితాన్ని పిల్లల కోసమే త్యాగం చేస్తాడు నాన్న. ఈ మాటలు అక్ష‌ర స‌త్య‌మ‌ని క్రికెటర్ మంగేష్ యాదవ్ తండ్రి రామావధ్ యాదవ్ రుజువు చేశాడు. బంధువులు వెక్కిరించినా, తిండికి డబ్బుల్లేకపోయినా వెనకడుగు వేయని రామావధ్ పట్టుదల.. నేడు తన కొడుకును కోటీశ్వరుడిని చేసింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన ఫాస్ట్ బౌల‌ర్ మంగేష్ యాద‌వ్.. ఐపీఎల్‌-2026లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌పున ఆడ‌నున్నాడు.  గ‌తేడాది జ‌రిగిన వేలంలో 23 ఏళ్ల మంగేష్ యాద‌వ్‌ను రూ. 5.2 కోట్ల భారీ ధ‌ర‌కు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఇప్పుడు విరాట్ కోహ్లి, భువనేశ్వ‌ర్ కుమార్ వంటి దిగ్గ‌జాల‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను షేర్ చేసుకోనున్నాడు. అయితే మంగేష్ ఈ స్ధాయికి చేరుకోవడంలో అత‌డి తండ్రి రామావధ్ యాదవ్‌ది కీల‌క పాత్ర‌.

ట్రక్ డ్రైవ‌ర్ కొడుకుగా.. 
మంగేష్ యాద‌వ్ మ‌ధ్ర‌ప్ర‌దేశ్‌ చింద్వారా జిల్లాలోని బోర్గావ్‌లో జ‌న్మించాడు. అత‌డు తండ్రి ఒక ట్ర‌క్ డ్రైవ‌ర్‌. కానీ మంగేష్‌కు చిన్న‌త‌నం నుంచే క్రికెట్‌పై మ‌క్కువ ఎక్కువ‌. ఓ వైపు పేద‌రికం వెంటాడుతున్న‌ప్ప‌టికి.. మంగేష్ క్రికెట్‌ను మాత్రం విడిచిపెట్ట‌లేదు.

అందుకు కార‌ణం త‌న తండ్రి రామావ‌ధ్. త‌ను ఎన్ని క‌ష్టాలు ప‌డైనా కానీ.. కొడుకును క్రికెటర్‌ను చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకోసం రేయింబవలు శ్రమిస్తూ కొడుకును ఐపీఎల్ వంటి పెద్ద టోర్నీలో ఆడే స్ధాయికి చేర్చాడు. అయితే తన స‌క్సెస్‌లో తండ్రితో పాటు కోచ్ ఫూల్ చంద్ కీలక పాత్ర పోషించినట్లు మంగేశ్ తాజాగా చెప్పుకొచ్చాడు.

"నేను ఈ రోజు ఈ స్ధాయికి చేరుకున్నానంటే అందుకు కార‌ణం మా నాన్న‌, ఫూల్ చంద్ సర్ మాత్రమే. నా కెరీర్‌లో ఆరంభంలో టెన్నిస్ బంతుల‌తో ఆడేవాడిని. మా మామయ్య ఒకరు నాలో టాలెంట్‌ను గుర్తించారు. కోచ్ ఫూల్ చంద్ శర్మ వద్ద శిక్షణ పొందేందుకు ఢిల్లీ వెళ్ళమని నాకు చెప్పారు. కానీ ఢిల్లీ వంటి మ‌హాన‌గ‌రానికి వెళ్లి కోచింగ్ తీసుకునే స్థాయి నాదు. 

అయిన‌ప్ప‌టికి నా కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంతో ఢిల్లీ వెళ్లేందుకు నిర్ణ‌యించుకున్నాను. ఆస‌మ‌యంలో మా నాన్న ఎంతో క‌ష్ట‌ప‌డి రూ. రూ. 24 వేలను ఇచ్చారు. అయితే ఆ డబ్బు మొదటి నెలలోనే ఎలా ఖర్చయిపోయిందో నాకు అర్థం కాలేదు. నా అవ‌స‌రాల‌ను తీర్చేందుకు మానాన్న ప్ర‌తీ నెలా ఎవ‌రో ఒక‌రు ద‌గ్గ‌ర అప్పుచేసేవారు. 

అయితే కోచింగ్‌లో ఉన్నప్పుడు ఒకానొక సమయంలో నేను కాస్త బద్ధకంగా తయారయ్యా. సార్ నన్ను పిలిచి బ్యాగ్ సర్దుకుని ఇంటికి వెళ్లిపోమని చెప్పారు. తర్వాత మళ్లీ ఆయన వద్దకు వెళ్లి సారీ చెప్పాను. మరోసారి ఇలా జరగదని మాటిచ్చాను. ఒక్కసారిగా నా కుటుంబం, మా నాన్న పడిన కష్టాలు గుర్తుకొచ్చాయి. ప్రతి ఒక్కరూ నా కోసం త్యాగం చేశారు" అని త‌న ట్రైనింగ్ రోజుల‌ను మంగేష్ గుర్తు చేసుకున్నాడు.

తిన‌డానికి తిండి కూడా లేదు..
ఆర్సీబీ లాంటి పెద్ద జ‌ట్టుకు మంగేష్ ఎంపిక‌వ్వ‌డంపై కోచ్ పూల్ చంద్ శ‌ర్మ సంతోషం వ్య‌క్తం చేశాడు. "మంగేష్ ఢిల్లీలో ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గర ఉండేవాడు. అత‌డు మంచి ఫాస్ట్ బౌల‌ర్‌. అయితే ఆర్ధిక ఇబ్బందులతో మాత్రం స‌త‌మ‌త‌మ‌య్యేవాడు. కనీసం మంచి తిండి కూడా తినేందుకు ఇబ్బంది పడేవాడు. దీంతో అతడిని మా హాస్టల్‌కు వచ్చేయమని చెప్పాను. నా దగ్గరకు వచ్చే ప్లేయర్‌కు దగ్గర డబ్బు ఉందా లేదా అని నేను చూడను. టాలెంట్ ఉంటే చాలు.. ఇక్కడే ఉండి, తింటూ, ప్రాక్టీస్ చేయవచ్చు" అని పూల్ చంద్ పేర్కొన్నాడు.

తన కొడుకు సక్సెస్‌పై రామావ‌ధ్ కూడా స్పందించారు. "డబ్బు కోసం నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. కొన్నిసార్లు రాత్రుళ్లు నాకు నిద్రే పట్టేది కాదు. అతడికి ఎలా సమకూర్చాలా అని ఆలోచిస్తూ ఉండిపోయవాడిని. అదేవిధంగా  ట్రక్ డ్రైవర్ల జీవితం అంత సులువు కాదు. 

హడావుడి ఎక్కువగా ఉంటుంది. మాకు కనీసం తినడానికి సమయం కూడా ఉండదు. ట్రక్కు నిండా లోడ్ ఉంటే దాన్ని ఎప్పుడు అన్-లోడ్ చేస్తామా అని టెన్షన్.. అదే ఖాళీగా ఉంటే దాన్ని నింపడానికి లోడ్ ఎక్కడ దొరుకుతుందా అన్న ఆందోళన ఉంటుంటి. ఇలాంటి పరిస్థితుల మధ్య నా కొడుకు కల కోసం శ్రమించాను" అని అని రామావధ్ తెలిపాడు.
చదవండి: IPL 2026: ఆర్సీబీ టీమ్ పేరు మార్పు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement