
లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. అయితే మూడో రోజు ఆట ఆఖరిలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వ్యవహరించిన తీరు వివాదస్పదమైంది. మూడో రోజు ఆట ముగియడానికి ఆరు నిమిషాలు ఉండగా.. ఇంగ్లండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది.
ఈ సమయంలో భారత్ కనీసం రెండు ఓవర్లు అయినా బౌలింగ్ చేయాలని తహతహలాడింది. కానీ ఇంగ్లండ్ ఓపెనర్లు మాత్రం ఒక్క ఓవర్ ఆడి మూడో రోజు ఆటను ముగించాలని భావించారు. దీంతో బుమ్రా వేసిన తొలి ఓవర్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ పదేపదే అంతరాయం కలిగించి సమయాన్ని వృథా చేశాడు.
ఈ క్రమంలో సహనం కోల్పోయిన గిల్.. క్రాలీని పరుష పదజాలంతో దూషించాడు. దీంతో జాక్ క్రాలీ కూడా వేలు చూపిస్తూ వాగ్వాదానికి దిగాడు. గిల్‌కు తోడుగా సిరాజ్ ఎంటర్ అవ్వడంతో కాసేపు ఫీల్డ్‌లో గందరగోళం నెలకొంది. ఆ తర్వాత అంపైర్‌లు జోక్యంతో చేసుకోవడంతో గొడవ సద్దమణిగింది. ఈ నేపథ్యంలో గిల్ తీరును ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జోనాథన్ ట్రాట్ తప్పుబట్టాడు. గిల్ ప్రవర్తన తనకు నచ్చలేదని అతడు విమర్శించాడు.
"ప్రతీ క్రీడలో కొంచెం గేమ్స్‌మ్యాన్‌షిప్ (కావాలనే సమయం వృథా చేయడం) ఉంటుంది. ఇంగ్లండ్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఏమి జరిగిందో, వారు ఎలా వ్యహరించారో నాకైతే తెలియదు. కానీ శుబ్‌మన్ గిల్ ప్రవర్తన మాత్రం నాకు నచ్చలేదు. అతడు కెప్టెన్ కాబట్టి అలా వ్యవహరించాడని అనుకుంటున్నా.
ఇప్పటికే నేను చాలా సార్లు చెప్పా, ఇతరుల వైపు వేలు చూపిస్తూ వారి ముందు నిలబడటం వంటివి చేయొద్దు. గిల్‌ను చూస్తుంటే గత కెప్టెన్ (కోహ్లీని ఉద్దేశించి) నాకు గుర్తొస్తున్నాడు. ఇలా చేయడం మీకు చెడ్డ పేరును తీసుకొస్తుంది. మైదానంలో దూకుడుగా ఉండడాన్ని నేను కూడా సమర్ధిస్తాను. కానీ శ్రుతిమించితే బాగోదు. భవిష్యత్తులో మీరు మరింత ఎదగాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రాట్ పేర్కొన్నాడు.
For those who have missed the bollywood level acting of Shubman Gill 😅 #INDvsENG pic.twitter.com/1Djrf92vs0
— Richard Kettleborough (@RichKettle07) July 13, 2025