ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమికి గల కారణాలివే | Top 4 reasons why Sunrisers Hyderabad crashed out against Rajasthan Royals" | Sakshi
Sakshi News home page

IPL 2026: ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమికి గల కారణాలివే

May 28 2026 1:57 PM | Updated on May 28 2026 2:16 PM

Top 4 reasons why Sunrisers Hyderabad crashed out against Rajasthan Royals"

ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరాటం ముగిసింది. వ‌రుస‌గా రెండో సీజ‌న్‌లో ఫైన‌ల్‌కు చేరుకుండానే టోర్నీని నుంచి ఎస్ఆర్‌హెచ్ ఇంటిముఖం ప‌ట్టింది. బుధ‌వారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన ఎలిమినేట‌ర్‌లో 47 ప‌రుగుల తేడాతో స‌న్‌రైజ‌ర్స్ ఓట‌మి పాలైంది. బౌలింగ్‌, బ్యాటింగ్ రెండింటిలోనూ ఎస్ఆర్‌హెచ్ త‌మ మార్క్ చూప‌లేక‌పోయింది.

తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో 196 పరుగుల‌కు ఆలౌటై టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. ఈ నేప‌థ్యంలో ఎస్ఆర్‌హెచ్ ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను ప‌రిశీలిద్దాం.

వైభవ్ ఊచకోత.. తేలిపోయిన బౌల‌ర్లు
ముఖ్యంగా ఎస్ఆర్‌హెచ్ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణం బౌలింగ్ వైఫ‌ల్య‌మ‌నే చెప్పుకోవాలి. వ‌ర‌ల్డ్ క్లాస్ పేస‌ర్ అయిన పాట్ క‌మిన్స్ సైతం ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. రాజ‌స్తాన్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీని సన్‌రైజర్స్ బౌలర్లు ఆపలేకపోయారు. కమ్మిన్స్‌ను వైభవ్ ఉతికారేశాడు. అతడి దెబ్బకు కమిన్స్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. గత మ్యాచ్‌లలో అద్బుతంగా రాణించిన ఇషాన్ మలింగ, షకీబ్ హుస్సేన్ సైతం ఎలిమినేటర్‌లో విఫలమయ్యారు. ఒకవేళ వైభవ్‌ను వీరు ముందుగానే అవుట్ చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. 

జోఫ్రా ఆర్చర్ దెబ్బ.. అభిషేక్ అబ్బ
ఇక సాధారణంగా ప్రతీ మ్యాచ్‌లోనూ మెరుపు ఆరంభాన్ని అందించే ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు.. ఆర్చర్ దెబ్బకు విలవిల్లాడారు. ఇన్నింగ్స్ రెండో బంతికే అద్భుతమైన బంతితో అభిషేక్‌ను ఆర్చర్ బోల్తా కొట్టించాడు. దీంతో అభిషేక్ ఖతాతెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్‌, ట్రావిస్ హెడ్‌లను సైతం ఆర్చర్ అవుట్ చేసి ఎస్‌ఆర్‌హెచ్‌ను కోలులోలేని దెబ్బ తీశాడు. అతడితో పాటు బర్గర్ కూడా ఓ వికెట్ సాధించాడు. దీంతో సన్‌రైజర్స్ పవర్‌ప్లేలోనే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

మిడిలార్డర్ ఫెయిలూర్‌
అయితే కర్ణాటక బ్యాటర్ స్మరణ్ రవిచంద్రన్ వరుస మ్యాచ్‌లలో విఫలమవుతున్నప్పటికి కీలకమైన ఎలిమినేటర్‌లో కూడా అతడిని ఆడించి ఎస్‌ఆర్‌హెచ్ తప్పుచేసింది. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన స్మరణ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అతడి స్ధానంలో అనికేత్ వర్మ వంటి ఆటగాళ్లకు అవకాశమిచ్చి ఉంటే బాగుండేది. మిడిలార్డ‌ర్‌లో నిల‌క‌డ‌గా రాణించే క్లాస‌న్ కూడా ఈ మ్యాచ్‌లో విఫ‌ల‌మ‌య్యాడు.

కొంపముం‍చిన కమిన్స్‌
ఎస్‌ఆర్‌హెచ్ ఓటమికి టాస్ కూడా ఓ కారణంగా చెప్పుకోవాలి. దాదాపు చాలా మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం కమిన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ తీసుకున్నాడు. అయితే  ముల్లాన్‌పూర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లకు, రెండో ఇన్నింగ్స్‌లో చేజింగ్ చేసిన జట్లకు మధ్య విజయాల శాతంలో పెద్దగా తేడా లేదు. రెండు వైపులా దాదాపు సమానమైన అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎస్‌ఆర్‌హెచ్ ముందు బ్యాటింగ్ చేసి రాజస్తాన్ ముందు మంచి స్కోర్ ఉంచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement