అతడిని చూసి నేర్చుకో! తిలక్ వర్మపై విమర్శల వర్షం | Tilak Varma declared useless for Mumbai Indians by ex-BCCI selector | Sakshi
Sakshi News home page

IPL 2026: అతడిని చూసి నేర్చుకో! తిలక్ వర్మపై విమర్శల వర్షం

Apr 13 2026 3:05 PM | Updated on Apr 13 2026 3:16 PM

Tilak Varma declared useless for Mumbai Indians by ex-BCCI selector

ఐపీఎల్‌-2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. ముంబైకి ఇది వరుసగా మూడో పరాజయం. దీంతో హార్దిక్ సేన పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పడిపోయింది.

ముఖ్యంగా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ ఫామ్ లేమి ముంబై జట్టు మేనెజ్‌మెట్ కలవరపెడుతోంది. ఈ ఏడాది సీజన్‌లో తిలక్ ఇప్పటివరకు ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లోనూ తిల‌క్ నిరాశ‌ప‌రిచాడు. 3 బంతుల్లో కేవలం ఒక్క‌ పరుగు చేసి ఔట‌య్యాడు.

మొత్తంగా నాలుగు మ్యాచ్‌లు ఆడిన‌ తిలక్ కేవలం 35 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేప‌థ్య‌లో తిల‌క్ వ‌ర్మ‌పై బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్‌లా తిలక్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించలేకపోతున్నాడని శ్రీకాంత్ అన్నాడు. కాగా పాటిదార్ కూడా నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి అద్భుత‌మైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు.

"తిల‌క్ వ‌ర్మ ప్ర‌స్తుతం ఫామ్‌లో లేడు. అత‌డికి భారీ షాట్లు ఆడే స‌త్తా లేదు. దూకుడుగా ఆడే బ్యాట‌ర్ కూడా కాదు. తిలక్ వర్మ మంచి టెక్నిక్ ఉన్న ఆటగాడే కావచ్చు, కానీ ఫిల్ సాల్ట్ లేదా రజత్ పాటిదార్ లాగా బౌల‌ర్ల‌ను టార్గెట్ చేయ‌లేడు. గత రెండు మూడు ఐపీఎల్ సీజన్ల నుంచి తిలక్ వర్మ ఆశించినంత మేర రాణించ‌లేక‌పోయాడు.

టీ20ల్లో క్రికెట్‌లో నిల‌క‌డ అవ‌స‌రం లేదు. పది మ్యాచ్‌ల్లో ఏడింటిలో 30-40 పరుగులు చేయడం కంటే, నాలుగింటిలో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును ఒంటిచేత్తో గెలిపించడం మేలు. ఇప్పుడు పాటిదార్ అదే చేస్తున్నాడు. తిల‌క్‌ను లోయార్డ‌ర్‌లో బ్యాటింగ్‌కు పంపిస్తే బెట‌ర్‌.

160 లేదా 170 పరుగులను ఛేజ్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే తిలక్ అద్భుతంగా ఆడతాడు. కానీ 200 లేదా 220 పరుగులను ఛేజ్ చేసేటప్పుడు తిలక్ వర్మ సరిపోడు" అని శ్రీకాంత్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IPL 2026: ఐపీఎల్ నుంచి రోహిత్ శ‌ర్మ అవుట్‌?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement