
మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయం
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిన తెలుగు టైటాన్స్ జట్టు మూడో మ్యాచ్‌తో గెలుపు బోణీ చేసింది. గురువారం జరిగిన పోరులో టైటాన్స్ 37–32తో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. టైటాన్స్ కెప్టెన్ విజయ్ మలిక్, ఆల్‌రౌండర్ భరత్ హుడా చెరో 8 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
రెయిడర్ చేతన్ సాహు, డిఫెండర్ అజిత్ పవార్ కూడా చెరో 5 పాయింట్లు సాధించి సహకరించారు. జైపూర్ తరఫున నితిన్ కుమార్ (13 పాయింట్లు) ఒంటరి పోరాటం వృథా అయింది. మ్యాచ్ 13వ నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి ఆధిక్యం సాధించిన టైటాన్స్, పదునైన డిఫెన్స్‌తో తొలి అర్ధ భాగాన్ని 16–9తో ముగించింది. మరో పది నిమిషాల తర్వాత ఇది 23–16కు మారింది.
అయితే ఆ తర్వాత రెయిడర్ నితిన్ ఒక్కసారిగా చెలరేగి టైటాన్స్‌ను ఆలౌట్ చేయడంతో పాటు సూపర్ రెయిడ్ సాధించాడు. దాంతో చివరి మూడు నిమిషాల్లో అంతరం కేవలం మూడు పాయింట్లకు తగ్గి ఉత్కంఠ పెరిగింది. అయితే విజయ్ మలిక్ ఒత్తిడిని అధిగమించి రెండు పాయింట్లు రాబట్టడంతో టైటాన్స్ ఊపిరి పీల్చుకుంది.
తొలిసారి గోల్డెన్ రెయిడ్‌లో గెలుపు
పుణేరి పల్టన్, దబంగ్ ఢిల్లీ మధ్య హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో చివరకు ‘గోల్డెన్ రెయిడ్’ ద్వారా ఫలితం వచ్చింది. ఇందులో ఢిల్లీ విజేతగా నిలిచింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 28–28 పాయింట్లతో సమంగా నిలిచాయి. ఆ తర్వాత ‘టైబ్రేక్’లో కూడా స్కోరు 5–5తో సమంగానే ముగిసింది. అనంతరం ‘గోల్డెన్ రెయిడ్’ కోసం టాస్ నెగ్గిన ఢిల్లీ తరఫున అశు మలిక్ రెయిడింగ్‌కు వెళ్లి అద్భుతంగా 2 పాయింట్లు సాధించడంతో జట్టుకు గెలుపు దక్కింది.