తెలంగాణ ప్రభుత్వ ఆశాభావం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందని, అందుకు తగిన వాతావరణం కల్పించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ఈ క్రమంలోనే తొలిసారి ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
ఈ యూనివర్సిటీలో త్వరలోనే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనున్న నేపథ్యంలో క్రీడలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక సదస్సును నిర్వహించింది. గచ్చిబౌలి స్టేడియంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా క్రీడలు, దాని అనుబంధ రంగాలతో సంబంధం ఉన్న పలువురు ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. ‘అటు క్రీడలు, ఇటు చదువుకు సమప్రాధాన్యం ఇస్తూ రెండు రంగాల్లోనూ అత్యుత్తమ ఫలితాలు అందించడమే యంగ్ ఇండియా యూనివర్సిటీ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం.
ఈ లక్ష్యంతో యూనివర్సిటీ సఫలం అవుతుందనే నమ్మకం ఉంది’ అని జయేశ్ రంజన్ చెప్పారు. గత రెండేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహించిందని స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ సోనీబాలా దేవి అన్నారు. స్పోర్ట్స్ ఎడ్యుకేషన్, ఒలింపిక్ వాల్యూస్, స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ టెక్నాలజీ, పారా స్పోర్ట్స్ వంటి ఐదు వేర్వేరు అంశాలపై చర్చా కార్యక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, ద్రోణాచార్య అవార్డీలు ఇస్మాయిల్ బేగ్, నాగపురి రమేశ్, స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కిషోర్ గోపినాథన్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు.


