2017 తర్వాత మళ్లీ ఇప్పుడే..

Team India Lose 1st Test Against England After 2017 In Home Series - Sakshi

భారత్‌- ఇంగ్లండ్‌ తొలి టెస్ట్‌

ఓటమిని ఆహ్వానించిన టీమిండియా

కొంపముంచిన బ్యాటింగ్‌ వైఫల్యం

చెన్నై: ఆసీస్‌ను జయించి వచ్చిన తర్వాత భారత్‌ నుంచి ఇలాంటి ఫలితాన్ని ఎవరైనా అంచనా వేశారా! నాలుగేళ్ల క్రితం ఇక్కడే 0–4తో చిత్తుగా ఓడిన జట్టు, ‘నామ్‌కే వాస్తే’లాంటి ఇద్దరు స్పిన్నర్లతో భారత్‌లో అడుగు పెట్టిన టీమ్‌ మనకు ఇలాంటి షాక్‌ ఇస్తుందని సగటు క్రికెట్‌ అభిమాని కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. అయితే అదే జరిగింది. స్వదేశంలో 2017 (పుణేలో)లో ఆసీస్‌ చేతిలో పరాజయం తర్వాత మళ్లీ టీమిండియాను ఒక జట్టు ఓడించగలిగింది. తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు బాగా అనుకూలించి ఆ తర్వాత పిచ్‌ మారిపోవడం, చివరి రోజు బ్యాటింగ్‌ చేయాల్సి రావడం భారత్‌ ఓటమికి ఒకానొక కారణంగా కనిపించవచ్చు. కానీ అది అర్ధ సత్యం మాత్రమే. సరిగ్గా చెప్పాలంటే జట్టు సమష్టిగా విఫలమైంది.

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్‌ వైఫల్యమే చివరకు మ్యాచ్‌ ఫలితాన్ని శాసించింది. ఇంగ్లండ్‌ ఏకంగా 190.1 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసిన తర్వాత మూడో రోజూ పిచ్‌ మెరుగ్గానే ఉంది. కానీ 60 ఓవర్లలోపే భారత్‌ 6 వికెట్లు చేజార్చుకుంది. దాంతో మరుసటి రోజు సుందర్‌ బ్యాటింగ్‌ను నమ్ముకోవాల్సి వచ్చింది. నిజానికి ఇంగ్లండ్‌ను భారీ స్కోరు చేయకుండా నిరోధించడంలో జట్టు విఫలమైంది. మన గడ్డపై విదేశీ బ్యాట్స్‌మెన్‌ రెండు రోజులపాటు ఇలా ఆడుకోవడం మనోళ్లకు ఎప్పుడూ అనుభవంలోకి రానిది. ఇక్కడే రవీంద్ర జడేజా లేని లోటు స్పష్టంగా కనిపించింది. అశ్విన్‌ రాణించినా... కెరీర్‌లో రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న నదీమ్, సుందర్‌లకు అసలు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి! తొలి ఇన్నింగ్స్‌ స్కోర్లలో భారీ అంతరం వచ్చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో దానిని పూడ్చటం దాదాపు అసాధ్యంగా మారిపోయింది. అశ్విన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్న చోట, సుందర్‌ను పూర్తిగా పక్కన పెట్టడం ఎలాంటి వ్యూహమో అర్థం కాలేదు. సుందర్‌ కేవలం బ్యాట్స్‌మన్‌గా జట్టులో ఉన్నాడా అన్నట్లుగా చివర్లో ఒకే ఒక ఓవర్‌ అతనితో వేయించారు.

చెన్నై పిచ్‌ ఎలా స్పందిస్తుందో భారత జట్టుకు పూర్తిగా తెలుసు. దానికి అనుగుణంగా సిద్ధం కావాల్సింది. ఆఖరి రోజు 381 పరుగుల ఛేదన అసాధ్యం అనిపించిన వేళ ‘డ్రా’ చేసుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఈ జట్టుకు ఉన్నాయనే అందరూ నమ్ముతారు. కానీ ఆఖరి రోజు దానికి భిన్నంగా జరిగింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌ కలిసి ఏకంగా 573 బంతులు (95.3 ఓవర్లు) ఆడిన అశ్విన్‌ ఒక్కడే ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున హీరోగా కనిపించాడు. మ్యాచ్‌లో ఆయా ఆటగాళ్ల భాగస్వామ్యాన్ని చూస్తే రోహిత్‌ శర్మ మాత్రమే అందరికంటే ఘోరంగా (18 పరుగులు) విఫలమయ్యాడు. మెల్‌బోర్న్‌ సెంచరీ తర్వాత వరుసగా విఫలమవుతున్న రహానే ఇక్కడా దానిని కొనసాగించడం జట్టుకు చేటు చేసింది. ఒక్క టెస్టు పరాజయంతో ఆందోళన అనవసరం అనిపించవచ్చు కానీ టీమిండియా ప్రస్తుత స్థితి, ఇటీవలి ఫామ్, సొంతగడ్డపై బలం... ఇలా ఏం చూసినా భారత్‌దే పైచేయిగా ఉండాల్సిన చోట వచ్చిన ఈ ఓటమి తీవ్రంగా నిరాశ కలిగించడం సహజం.  

టాస్‌తో ఫలితమా..! 
భారత జట్టు టాస్‌ గెలిచి ఉంటే ముుందుగా బ్యాటింగ్‌ చేసి ఉంటే ఫలితం సరిగ్గా దీనికి రివర్స్‌లో వచ్చేది అంటూ ఒక చర్చ సాగుతోంది. అయితే టాస్‌ మాత్రమే మ్యాచ్‌ ఫలితాన్ని శాసించదు. పట్టుదలగా రెండు రోజులు నిలబడి దాదాపు 600 పరుగులు చేయడం సాధారణ విషయం కాదు. దీంతో ఇంగ్లండ్‌ తమ విజయానికి బాటలు వేసుకోగా, భారత్‌ అదే అంకితభావాన్ని ప్రదర్శించలేకపోయింది. ఇక చరిత్ర చూస్తారా... ఇక్కడ గత రెండు పర్యటనల్లో ఇంగ్లండ్‌ 3 టెస్టులు గెలిచింది. ఈ మూడు సార్లూ ఇంగ్లండ్‌ టాస్‌ ఓడిపోవడం విశేషం! 2012 సిరీస్‌లో రెండు టెస్టుల్లోనూ భారత్‌ ముందుగా బ్యాటింగ్‌ చేయగా, 2006 ముంబై టెస్టులో భారత్‌ కోరడంతో ఇంగ్లండ్‌ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top