దర్జాగా సెమీస్‌కు...

Team India has reached knockout stage of Womens T20 World Cup - Sakshi

మహిళల టి20 ప్రపంచకప్‌లో నాకౌట్‌ దశకు టీమిండియా 

చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై విజయం 

స్మృతి మంధాన మెరుపులు

కెబేహ (దక్షిణాఫ్రికా): ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా, ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడకుండా భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో నేరుగా సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఐర్లాండ్‌తో సోమవారం జరిగిన గ్రూప్‌–2 చివరి లీగ్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమిండియా ‘డక్‌వర్త్‌ లూయిస్‌’ పద్ధతిలో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్మృతి మంధాన (56 బంతుల్లో 87; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.

టి20 కెరీర్‌లో స్మతికిదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. స్మృతి మూడుసార్లు ఇచ్చిన క్యాచ్‌లను ఐర్లాండ్‌ ఫీల్డర్లు వదిలేయడం గమనార్హం. షఫాలీ వర్మ (29 బంతుల్లో 24; 3 ఫోర్లు)తో తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించిన స్మృతి... హర్మన్‌ప్రీత్‌ (20 బంతుల్లో 13)తో రెండో వికెట్‌కు 52 పరుగులు జత చేసింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 54 పరుగులు సాధించిన సమయంలో వర్షం రావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది.

వర్షం తగ్గకపోవడంతో మిగతా ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ‘డక్‌వర్త్‌ లూయిస్‌’ పద్ధతి ప్రకారం 8.2 ఓవర్లలో ఐర్లాండ్‌ విజయసమీకరణం 59 పరుగులుగా ఉంది. అయితే ఆ జట్టు ఐదు పరుగులు వెనుకపడి ఉండటంతో భారత విజయం ఖరారైంది. ఈ టోర్నీలో ఐర్లాండ్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం గమనార్హం. ఈ గెలుపుతో భారత్‌ ఆరు పాయింట్లతో గ్రూప్‌–2లో రెండో స్థానంతో సెమీఫైనల్‌ చేరింది. గురువారం జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్, గ్రూప్‌–1 టాపర్‌ ఆస్ట్రేలియాతో భారత్‌ ఆడుతుంది.  

పాకిస్తాన్‌తో నేడు తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనున్న ఇంగ్లండ్‌ ఆరు పాయింట్లతో ఇప్పటికే గ్రూప్‌–2 నుంచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రన్‌రేట్‌ పరంగా భారత్‌ (0.253) కంటే ఇంగ్లండ్‌ (1.776) మెరుగ్గా ఉంది. ఒకవేళ నేటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓడిపోయినా గ్రూప్‌–2లో ఆ జట్టే ‘టాప్‌’లో నిలుస్తుంది. గ్రూప్‌–2 టాపర్‌ హోదాలో ఇంగ్లండ్‌ శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్‌–1లో రెండో స్థానంలో నిలిచే అవకాశమున్న న్యూజిలాండ్‌ లేదా దక్షిణాఫ్రికాతో ఆడుతుంది.

గ్రూప్‌–1లో న్యూజిలాండ్‌ నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకొని 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నేడు బంగ్లాదేశ్‌తో చివరి మ్యాచ్‌ ఆడనున్న దక్షిణాఫ్రికా సెమీస్‌ చేరాలంటే తప్పనిసరిగా గెలవాలి. అలా జరిగితే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక 4 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలుస్తాయి. ఈ దశలో న్యూజిలాండ్, శ్రీలంకకంటే మెరుగైన రన్‌రేట్‌ ఉన్న దక్షిణాఫ్రికా సెమీస్‌ చేరుకుంటుంది.  

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: షఫాలీ వర్మ (సి) అమీ హంటర్‌ (బి) లౌరా డెలానీ 24; స్మృతి మంధాన (సి) గ్యాబీ లూయిస్‌ (బి) ఒర్లా ప్రెండర్‌గాస్ట్‌ 87; హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (సి) ప్రెండర్‌గాస్ట్‌ (బి) లౌరా డెలానీ 13; రిచా ఘోష్‌ (సి) గ్యాబీ లూయిస్‌ (బి) లౌరా డెలానీ 0; జెమీమా రోడ్రిగ్స్‌ (స్టంప్డ్‌) వాల్‌డ్రోన్‌ (బి) కెల్లీ 19; దీప్తి శర్మ (సి) డెంప్సీ (బి) ప్రెండర్‌గాస్ట్‌ 0; పూజా వస్త్రకర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–62, 2–114, 3–115, 4–143, 5–143, 6–155. 

బౌలింగ్‌: ఒర్లా ప్రెండర్‌గాస్ట్‌ 4–0–22–2, డెంప్సీ 3–0–27–0, కెల్లీ 4–0–28–1, లెహ్‌ పాల్‌ 3–0–27–0, కారా ముర్రే 2–0–16–0, లౌరా డెలానీ 4–0–33–3. 
ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌: అమీ హంటర్‌ (రనౌట్‌) 1; గ్యాబీ లూయిస్‌ (నాటౌట్‌) 32; ప్రెండర్‌గాస్ట్‌ (బి) రేణుక సింగ్‌ 0; లౌరా డెలానీ (నాటౌట్‌) 17; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (8.2 ఓవర్లలో 2 వికెట్లకు) 54. వికెట్ల పతనం: 1–1, 2–1. బౌలింగ్‌: రేణుక 2–0–10–1, శిఖా పాండే 2.2–0 –14–0, దీప్తి 1–0–11–0, రాజేశ్వరి 1–0–5–0.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top