T20 World Cup 2022 Finals: ఆఖరి పోరాటం

T20 World Cup 2022: Rain threat looms over England-Pakistan final - Sakshi

నేడు టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌

అమీతుమీకి ఇంగ్లండ్, పాకిస్తాన్‌ సిద్ధం

మ్యాచ్‌కు వర్షం ముప్పు!

మధ్యాహ్నం గం. 1:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

26 అక్టోబర్, 2022: ఐర్లాండ్‌ చేతిలో అనూహ్యంగా ఓడిన ఇంగ్లండ్‌
27 అక్టోబర్, 2022: జింబాబ్వే చేతిలో స్వయంకృతంతో ఓడిన పాక్‌

టి20 ప్రపంచకప్‌లో ఈ మ్యాచ్‌ల తర్వాత ఈ రెండు జట్లపై సహజంగానే విమర్శలు చుట్టుముట్టాయి... టోర్నీలో ముందుకెళ్లడంపై సందేహాలు కనిపించాయి. కానీ అటు పాక్, ఇటు ఇంగ్లండ్‌ మళ్లీ ఉవ్వెత్తున ఎగిసాయి. తమలోని అసలు సత్తాను చూపిస్తూ దూసుకొచ్చాయి. ఇప్పుడు నవంబర్‌ 13, 2022న ప్రపంచకప్‌ ఫైనల్లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. అన్ని అంచనాలను దాటి, ఫేవరెట్‌లను వెనక్కి నెట్టి విశ్వ విజేతగా నిలిచేందుకు పోటీ పడుతున్నాయి.

ఈ మెగా టోర్నీని ఇప్పటికే చెరోసారి గెలుచుకున్న టీమ్‌లలో ఎవరి ఖాతాలో రెండోసారి ట్రోఫీ వెళుతుందో చూడాలి. ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ) వేదికపై ఐసీసీ టోర్నీలో ఫైనల్లో ఈ రెండు జట్లు ముఖాముఖిగా ఎదుర్కోవడం ఇది రెండోసారి. 1992 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై పాక్‌ గెలవగా... మూడు దశాబ్దాల తర్వాత అదే పునరావృతమవుతుందా లేక భిన్నమైన ఫలితం వస్తుందా అనేది ఆసక్తికరం.   

మెల్‌బోర్న్‌: అనూహ్య ఫలితాలు, హోరాహోరీ మ్యాచ్‌లు, çసంచలన ప్రదర్శనలతో ఆసక్తికరంగా సాగిన 2022 టి20 ప్రపంచకప్‌ ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. 42 గ్రూప్‌ మ్యాచ్‌లు, 2 నాకౌట్‌ మ్యాచ్‌ల తర్వాత 45వ పోరులో విశ్వ విజేత ఎవరో తేలనుంది. నేడు జరిగే ఫైనల్లో మాజీ చాంపియన్లు పాకిస్తాన్, ఇంగ్లండ్‌ తలపడనున్నాయి. ప్రస్తుత బలాబలాలు, ఫామ్‌ను బట్టి చూస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. సెమీఫైనల్‌ మ్యాచ్‌లలోనూ రెండు జట్లూ ఏకపక్ష విజయాలు సాధించి తుది పోరుకు అర్హత సాధించాయి. పాకిస్తాన్‌ గడ్డపై ఇటీవలే ఇరు జట్ల మధ్య దాదాపు ఇదే ఆటగాళ్లతో 7 టి20 మ్యాచ్‌ల సిరీస్‌ జరిగింది కాబట్టి ప్రత్యర్థి గురించి ఆయా జట్టుకు మంచి అవగాహన ఉంది.  

మార్పుల్లేకుండా...
సెమీస్‌లో అన్ని విధాలా సత్తా చాటిన పాకిస్తాన్‌ ఫైనల్‌ కోసం ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్, రిజ్వాన్‌ విజయవంతమైన ఓపెనింగ్‌ జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. మిడిలార్డర్‌లో మసూద్, ఇఫ్తికార్, నవాజ్‌లతో జట్టు బ్యాటింగ్‌ మెరుగ్గానే ఉంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’కి పోటీ పడుతున్న లెగ్‌స్పిన్నర్‌ షాదాబ్‌ ఆల్‌రౌండర్‌ పాత్రలో జట్టుకు టోర్నీ ఆసాంతం అండగా నిలిచాడు. అన్ని మ్యాచ్‌లలాగే పాక్‌ నలుగురు రెగ్యులర్‌ పేసర్లతో బరిలోకి దిగడం ఖాయం. షాహిన్‌ అఫ్రిది గాయం నుంచి కోలుకున్న తర్వాత ప్రమాదకరంగా మారడం సానుకూలాంశం. నసీమ్, వసీమ్‌ కూడా తమ పరిధిలో రాణిస్తుండగా రవూఫ్‌పై కూడా పాక్‌ ఆశలు పెట్టుకుంది. బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ తరఫున ఆడిన అతడిని ఎదుర్కోవడం ఇంగ్లండ్‌కు అంత సులువు కాదు.   

ఓపెనర్లే కీలకం...
సెమీస్‌లో హేల్స్, కెప్టెన్‌ బట్లర్‌ ఆటను చూస్తే వారిద్దరు ఎలాంటి విధ్వంసం సృష్టించగలరో తెలుస్తుంది. అయితే వీరిద్దరు మినహా ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌లో ఎవరు కూడా టోర్నీ మొత్తంలో ఒక సిక్స్‌కు మించి కొట్టలేదు! స్టోక్స్, బ్రూక్స్, లివింగ్‌స్టోన్‌ కూడా తమపై ఉన్న అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయారు. ఈ బలహీనతపై తమ స్పిన్‌తో పాక్‌ దెబ్బ కొట్టగలిగితే ఇంగ్లండ్‌కు కష్టం కావచ్చు. అయితే ఓపెనర్లే ఆటను ఏకపక్షంగా మార్చేయగలరు కాబట్టి వారిద్దరే కీలకం కానున్నారు. ఆరంభంలో షాహిన్‌ని సమర్థంగా ఎదుర్కోగలిగితే హేల్స్, బట్లర్‌ ఆపై ఆధిపత్యం ప్రదర్శించగలరు.

జట్టులో దాదాపు అందరూ బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం ఉన్నవారే అయినా అదే దూకుడుతో వికెట్లు కూడా చేజార్చుకోగలరు. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్లు మొయిన్‌ అలీ, వోక్స్, స్యామ్‌ కరన్‌లపై అదనపు బాధ్యత ఉంది. అయితే టోర్నీలోనే ఫాస్టెస్ట్‌ బౌలర్‌గా ఉన్న మార్క్‌ వుడ్‌ టీమ్‌లో లేకపోవడం జట్టుకు కొంత సమస్యగా మారింది. సెమీస్‌ లో కూడా అతను ఆడలేదు. ఫైనల్‌కు అతను వస్తే జట్టు బౌలింగ్‌ బలం పెరుగుతుంది. టోర్నీలో చక్కటి ప్రభావం చూపించిన కరన్‌ కూడా రాణిస్తే పాక్‌ బ్యాటర్లకు కష్టాలు తప్పవు. మొత్తంగా చూస్తే ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌లో బలంగా ఉండగా, బౌలింగ్‌లో పాకిస్తాన్‌ది పైచేయిగా కనిపిస్తోంది. ఇంగ్లండ్‌ గెలిస్తే ఒకే సమయంలో వన్డే, టి20 వరల్డ్‌కప్‌లను తమ వద్ద ఉంచుకున్న తొలి జట్టుగా నిలుస్తుంది.  

పిచ్, వాతావరణం
ఫైనల్‌కు పెద్ద సమస్య వర్షం రూపంలోనే పొంచి ఉంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఆదివారం 100 శాతం వర్ష సూచన ఉంది. అయితే మెల్‌బోర్న్‌ వాతావరణం అనిశ్చితికి మారుపేరు. భారత్, పాక్‌ మ్యాచ్‌కు ముందు కూడా ఇలాగే భావించినా, ఒక్క చుక్క వర్షం పడలేదు! ఫైనల్‌కు రిజర్వ్‌ డే ఉంది. అయితే నిబంధనల ప్రకారం రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 10 ఓవర్ల ఆట జరిగితే ఆదివారమే ఫలితం తేలిపోతుంది. అంతకన్నా తక్కువకే ఆట ఆగిపోతే, సోమవారం అదే స్కోరు నుంచి కొనసాగిస్తారు. పిచ్‌ ఆరంభంలో పేస్, బౌన్స్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే బ్యాటర్లు దానిని అధిగమిస్తే భారీ స్కోరుకు అవకాశం ఉంది.  

9: పాకిస్తాన్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఇప్పటి వరకు 28 టి20 మ్యాచ్‌లు జరిగాయి. 9 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ నెగ్గగా... 17 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ గెలిచింది. ఒక మ్యాచ్‌ ‘టై’ అయింది. మరో మ్యాచ్‌ రద్దయింది.
29: టి20 ప్రపంచకప్‌ టోర్నీ చరిత్రలో పాకిస్తాన్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా... రెండింటిలోనూ ఇంగ్లండే విజయం సాధించింది.
3: ఇంగ్లండ్, పాకిస్తాన్‌ జట్లకిది మూడో టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌. 2007లో పాక్‌ రన్నరప్‌గా నిలిచి, 2009లో టైటిల్‌ సాధించింది. ఇంగ్లండ్‌ 2010లో చాంపియన్‌గా నిలిచి, 2016లో రన్నరప్‌తో సంతృప్తి పడింది.
59: ఇప్పటి వరకు ఏడు టి20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌ జరగ్గా... ఛేజింగ్‌ చేసిన జట్లు ఐదుసార్లు... తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు రెండుసార్లు గెలిచాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top