T20 World Cup: అప్పటి నుంచి టీమిండియా ఒక్క టైటిల్‌ కూడా గెలవలేదు!

T20 World Cup 2021: Interesting Facts About Team India In Tourney Till Now - Sakshi

T20 World Cup 2021: పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌ అసలు ఆట నేటి(శనివారం) నుంచి మొదలుకానుంది. ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో సూపర్‌-12 రౌండ్‌కు తెరలేవనుంది. ఇక నవంబర్‌ 14న జరిగే ఫైనల్‌ వరకు మెరుపు ప్రదర్శనలు, విధ్వంసకర బ్యాటింగ్‌ విన్యాసాలతో ఈ 23 రోజులు క్రికెట్‌ అభిమానులకు పెద్ద పండగే! టీమిండియా విషయానికి వస్తే.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తేల్చుకునేందుకు పదునైన అస్త్రాలతో భారత్‌ ఆదివారం రంగంలోకి దిగనుంది. మరి టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో మన రికార్డులు ఎలా ఉన్నాయి?!

మనమెక్కడ? 
టి20 ప్రపంచకప్‌ చరిత్రలో భారత్‌ 33 మ్యాచ్‌లు ఆడింది. 20 మ్యాచ్‌ల్లో గెలిచింది. 11 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్‌ ‘టై’కాగా, మరో మ్యాచ్‌ రద్దయింది. 

2007లో జరిగిన తొలి టి20 ప్రపంచకప్‌లో ధోని సారథ్యంలో భారత జట్టు అనూహ్య ప్రదర్శనతో విజేతగా నిలిచింది. ఈ విజయం ఐపీఎల్‌ అంకురార్పణకు కారణమై వాణిజ్యపరంగా మెగా లీగ్‌ టోర్నీని క్రికెట్‌ ప్రపంచానికి అందించింది.

ఐపీఎల్‌ ద్వారా ఎంతో మంది యువ, ప్రతిభావంతులైన ఆటగాళ్లు వెలుగులోకి వచ్చి భారత క్రికెట్‌లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే ఆసక్తికరంగా ఐపీఎల్‌ మొదలైన తర్వాత ఐదు మెగా టోర్నీలు జరిగినా భారత్‌ ఒక్కసారి కూడా టైటిల్‌ సాధించలేకపోయింది.

2014లో ఫైనల్, 2016 సెమీస్‌ చేరినా... మిగతా మూడుసార్లు గ్రూప్‌ దశకే పరిమితమైంది. ఈ ఆరు టోర్నీల్లోనూ ధోనినే కెప్టెన్‌గా వ్యవహరించాడు.

కోహ్లికి కెప్టెన్‌గా ఇదే తొలి, చివరి టి20 ప్రపంచకప్‌ కానుండగా... మెంటార్‌ పాత్రలో వచ్చిన ధోని మార్గనిర్దేశనం జట్టుకు ఈసారి ఎలాంటి ఫలితాలు ఇస్తుందనేది చూడాలి.   

ఇండియా- సూపర్‌ 12, గ్రూప్‌-2
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ.

రిజర్వు ప్లేయర్లు: శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ చహర్‌, అక్షర్‌ పటేల్‌.

చదవండి: T20 World Cup 2021: టీమిండియా షెడ్యూల్‌.. ఇతర విశేషాలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top