WC: నో రిజర్వ్‌ డే!.. ఒకవేళ టీమిండియా సెమీస్‌ చేరితే.. జరిగేది ఇదే! | Sakshi
Sakshi News home page

T20 WC: నో రిజర్వ్‌ డే! ఒకవేళ టీమిండియా సెమీస్‌ చేరితే.. జరిగేది ఇదే!

Published Wed, May 15 2024 4:22 PM

T20 WC 2024: India to Play Semifinal in Guyana If They Reach Last Four Stage

టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియాఒకవేళ సెమీఫైనల్‌ చేరితే ఆ మ్యాచ్‌ ‘రిజర్వ్‌ డే’ లేకుండానే జరగనుంది. తొలి సెమీఫైనల్, ఫైనల్‌కు మాత్రమే ‘రిజర్వ్‌ డే’ ఉంచుతున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా ఈ మెగా టోర్నీలో తొలి సెమీఫైనల్‌ తరూబా (ట్రినిడాడ్‌)లో జూన్‌ 26న స్థానిక కాలమానం ప్రకారం రాత్రి గం. 8:30కు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు అంతరాయం కలిగితే తర్వాతి రోజు రిజర్వ్‌ డే మ్యాచ్‌ కొనసాగుతుంది. 

కానీ రెండో సెమీఫైనల్‌ పరిస్థితి అలా లేదు. పటిష్ట భారత జట్టు సెమీస్‌ చేరవచ్చని భావిస్తున్న రెండో సెమీస్‌ ప్రొవిడెన్స్‌ (గయానా)లో జరుగుతుంది. ఇది జూన్‌ 27న స్థానిక కాలమానం ఉదయం గం.10:30కి (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) ప్రారంభమవుతుంది. 

టీవీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకునే
భారత్‌లోని టీవీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకునే ఈ సమయాన్ని ఖరారు చేశారు. డే మ్యాచ్‌ కాబట్టి ఆ రోజంతా చాలినంత సమయం ఉంటుంది. దానిని మరుసటి రోజుకు కొనసాగించడంలో అర్థం లేదని ఐసీసీ భావించింది.

పైగా జూన్‌ 29న ఫైనల్‌ కాబట్టి రెండో సెమీస్‌లో గెలిచిన జట్టు వరుసగా మూడో రోజులు ఆడాల్సిన స్థితి వస్తుంది. ఇది సరైంది కాదని, ఫైనల్‌కు ముందు ఒక రోజు ప్రయాణం ప్లస్‌ విరామం ఉండాలి కాబట్టి అదే రోజు ఫలితాన్ని తేల్చాలని నిర్ణయించింది.

అదనపు సమయం..
అయితే ‘రిజర్వ్‌’కు బదులుగా రెండో సెమీస్‌కు 250 నిమిషాల అదనపు సమయాన్ని ఇస్తారు. వర్షం లేదా ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా ఆట పూర్తిగా జరగకపోతే మరో నాలుగు గంటల పాటు వేచి చూస్తారు. అయితే ఆట జరగకపోతే నిబంధనల ప్రకారం ‘సూపర్‌ ఎయిట్‌’లో ఎక్కువ పాయింట్లు సాధించిన టీమ్‌ ఫైనల్‌ చేరుతుంది.    

ఏ గ్రూపులో ఏ జట్టు?
👉గ్రూప్‌-ఏ: కెనడా, ఇండియా(ఏ1), ఐర్లాండ్‌, పాకిస్తాన్‌(ఏ2), యూఎస్‌ఏ
👉గ్రూప్‌-బి: ఆస్ట్రేలియా(బీ2), ఇంగ్లండ్‌(బీ1), నమీబియా, ఒమన్‌, స్కాట్లాండ్‌.
👉గ్రూప్‌-సి: అఫ్గనిస్తాన్‌, న్యూజిలాండ్‌(సీ1), పపువా న్యూగినియా, ఉగాండా, వెస్ట్‌ ఇండీస్‌(సీ2).
👉గ్రూప్‌-డి: బంగ్లాదేశ్‌, నేపాల్‌, నెదర్లాండ్స్‌, సౌతాఫ్రికా(డీ1), శ్రీలంక(డీ2).

సూపర్‌-8కు అర్హత సాధించిన జట్లు
👉ఇండియా, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా, శ్రీలంక. కాగా జూన్‌ 1 నుంచి మొదలుకానున్న టీ20 వరల్డ్‌కప్‌-2024కు అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ ఈ మెగా టోర్నీకి రోహిత్‌ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది.

చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్‌ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్‌ ఫైర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement