T20 WC 2022 IND Vs ENG: ఆ అంపైర్‌ లేడు.. టీమిండియా సెమీస్‌ గండం దాటినట్టే..!

T20 WC 2022: Match Official Appointments For Semi Finals Announced - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 సెమీఫైనల్‌ మ్యాచ్‌లకు సంబంధించిన మ్యాచ్‌ అఫీషియల్స్‌ (అంపైర్లు, రిఫరి) జాబితాను ఐసీసీ ఇవాళ (నవంబర్‌ 7) విడుదల చేసింది. సిడ్నీ వేదికగా న్యూజిలాండ్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య నవంబర్‌ 9న జరిగే తొలి సెమీఫైనల్‌కు ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్లుగా మరయిస్‌ ఎరాస్మస్‌, రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ వ్యవహరించనుండగా.. రిచర్డ్‌ కెటిల్‌బొరో, మైఖేల్‌ గాఫ్‌లు థర్డ్‌, ఫోర్త్‌ అంపైర్లుగా ప్రకటించబడ్డారు. ఈ మ్యాచ్‌కు రిఫరీగా క్రిస్‌ బ్రాడ్‌ వ్యవహరించనున్నాడు.

ఇక, నవంబర్‌ 10న అడిలైడ్‌ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. కుమార ధర్మసేన, పాల్‌ రిఫిల్‌ ఫీల్డ్‌ అంపైర్లుగా.. క్రిస్‌ గఫానీ, రాడ్‌ టక్కర్‌ థర్డ్‌, ఫోర్త్‌ అంపైర్లుగా, డేవిడ్‌ బూన్‌ మ్యాచ్‌ రిఫరీగా వ్యవహరించనున్నారు.

ఇదిలా ఉంటే, ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకు అచ్చిరాని అంపైర్‌గా ముద్రపడ్డ రిచర్డ్‌ కెటిల్‌బొరో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ఐసీసీ ప్రకటించిన అఫీషియల్స్‌ జాబితాలో లేకపోవడంతో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బ్రతికిపోయాం రా బాబు.. ఇక, టీమిండియా ఫైనల్‌కు చేరడం ఖాయమంటూ సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. 

కెటిల్‌బొరో అంపైర్‌గా లేడు కాబట్టి.. టీమిండియా సెమీస్‌ గండం దాటినట్టే, ఇంగ్లండ్‌పై గెలుపు మనదే, ఫైనల్‌కు ఎవరు వచ్చినా టీమిండియా విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 9 ఏళ్లుగా టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవకపోవడానికి పరోక్ష కారణమైన కెటిల్‌బొరో లేడు కాబట్టి రోహిత్‌ సేన విజయం లాంఛనమేనని కామెంట్ చేస్తున్నారు.

కాగా, 2013 నుంచి ఐసీసీ టోర్నీల్లో రిచర్డ్‌ కెటిల్‌బొరో అంపైర్‌గా వ్యవహరించిన (భారత్‌ ఆడిన మ్యాచ్‌లు) ప్రతి నాకౌట్‌ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. కెటిల్‌బొరో ఫీల్డ్‌ అంపైర్‌గా లేదా థర్డ్‌ అంపైర్‌గా వ్యవహరించిన.. 2014 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌, 2015 వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌, 2016 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌, 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌, 2019 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌, 2021 వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో టీమిండియా దారుణ పరాజయాలను మూటగట్టుకుంది. దీంతో కెటిల్‌బొరోపై భారతీయుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top