ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిది. గురువారం క్వీన్స్‌ల్యాండ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో 48 పరుగుల తేడాతో ఆసీస్‌ను టీమిండియా చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మెన్ ఇన్ బ్లూ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగుల స్కోరు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో ఆస్ట్రేలియాను 119 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ స్పందించాడు.
"సిరీస్‌లో ముందంజ వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా బ్యాటర్లకు క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. ముఖ్యంగా అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వారిద్దరూ మాకు పవర్ ప్లేలో మంచి ఆరంభాన్ని ఇచ్చారు.
ఈ పిచ్‌పై 200 పైగా పరుగులు సాధించడం చాలా కష్టమని మా ఓపెనర్లు ముందే గ్రహించారు. అందుకే గిల్ ఆచితూచి ఆడాడు. బ్యాటింగ్‌లో దాదాపుగా ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. డగౌట్ నుంచి నుంచి కూడా మాకు ఎప్పటికప్పుడు సందేశాలు అందుతూ ఉన్నాయి. గౌతీ భాయ్(గంభీర్), నేను ఒకే అభిప్రాయంతో ఉన్నాము. మిడిల్ ఓవర్లలో శివమ్ దూబేను ఎటాక్‌లో తీసుకు రావాలని నిర్ణయించుకున్నాము.
అందుకు తగ్గట్టే దూబే మాకు కీలక వికెట్లను అందించాడు. నిజంగా బౌలర్లు కూడా అద్భుతం చేశారు. మంచు ప్రభావం ఉన్నప్పటికి మా బౌలర్లు ఎక్కడ కూడా పట్టుకోల్పోలేదు. పిచ్ కండీషన్స్ తగ్గట్టు బౌలింగ్ చేశారు. మా జట్టులో నాలుగు ఓవర్లు కూడా బౌలింగ్ చేసే ఆల్‌రౌండర్లు ఉండడం గొప్ప విషయం.
అయితే వారిని పరిస్థితుల బట్టి ఉపయోగిస్తాం. కొన్ని రోజులు వాషింగ్టన్ నాలుగు ఓవర్లు వేస్తే.. దూబే రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేస్తాడు. మరి కొన్ని మ్యాచ్‌లలో దూబే నాలుగు ఓవర్లు వేస్తే.. వాషింగ్టన్‌కు రెండు ఓవర్లే వస్తాయి. కానీ జట్టుకు ఏం అవసరమో అది అందించడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్ ప్లాప్


