సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
57 పరుగులతో రాజస్తాన్ రాయల్స్ చిత్తు
217 పరుగుల లక్ష్యఛేదన... అందరి కళ్లూ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపైనే... ఎన్ని సిక్సర్లు కొడతాడు, రాజస్తాన్ ఎంత వేగంగా విజయం సాధిస్తుందనేదానిపైనే చర్చ... కానీ సన్‌రైజర్స్ పేసర్ ప్రఫుల్ హింగే ఒక్కసారిగా దూసుకొచ్చాడు. రెండో బంతికే వైభవ్ డకౌట్... నాలుగో బంతికి జురేల్ డకౌట్... చివరి బంతికి ప్రిటోరియస్ డకౌట్... ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లోనే 3 వికెట్లు పడటం మొదటిసారి కాగా, అరంగేట్ర మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా ప్రఫుల్ చరిత్రకెక్కాడు. ఆపై రాజస్తాన్ స్కోరు 3 ఓవర్లలో 9 పరుగులకే 5 వికెట్లు. అంతే... అక్కడే సన్‌రైజర్స్ మ్యాచ్ గెలిచేసింది... మిగతా ఆటంతా ఇక లాంఛనంగానే మిగిలింది.
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ తాజా సీజన్‌లో రెండు సార్లు 200కుపైగా స్కోరు చేసి కూడా ఓటమిని మూటగట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి భారీ స్కోరును కాపాడుకుంది. అయితే జట్టు బలహీనతగా కనిపించిన బౌలింగ్ విభాగం ఇప్పుడు మ్యాచ్‌ను గెలిపించింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన పోరులో ఇషాన్ కిషన్ బృందం 57 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 91; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగగా... హెన్రిచ్ క్లాసెన్ (26 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం రాజస్తాన్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. డొనొవాన్ ఫెరీరా (44 బంతుల్లో 69; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (32 బంతుల్లో 45; 5 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 72 బంతుల్లో 118 పరుగులు జోడించి పోరాడినా అది సరిపోలేదు.
కీలక భాగస్వామ్యం...
అభిషేక్ శర్మ (0) వెనుదిరిగిన తర్వాత ట్రవిస్ హెడ్ (18) కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే ఇషాన్ మెరుపు బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. ఆర్చర్ ఓవర్లో 4, 6 కొట్టిన అతను బర్గర్, సందీప్ ఓవర్లలో ఒక్కో సిక్స్ బాదాడు. పవర్‌ప్లేలో జట్టు 51 పరుగులు చేయగలిగింది. ఇషాన్, క్లాసెన్ భాగస్వామ్యంలో రైజర్స్ ఇన్నింగ్స్ దూసుకుపోయింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 39 బంతుల్లోనే 88 పరుగులు జోడించారు. బిష్ణోయ్ ఓవర్లో సిక్స్‌తో 30 బంతుల్లో కిషన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆ తర్వాత తుషార్ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిపోయిన కిషన్... ఆ తర్వాత ఆర్చర్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. అయితే సెంచరీకి చేరువలో అతని ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత కొద్ది సేపటికే క్లాసెన్ కూడా అవుట్ కాగా, నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 28; 4 సిక్స్‌లు) దూకుడుతో స్కోరు 200కు చేరువైంది. చివర్లో సలీల్ అరోరా (13 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరికొన్ని కీలక పరుగులు జోడించాడు.
అభిషేక్ మళ్లీ డకౌట్...
సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ హైదరాబాద్ అభిమానులను మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు. సొంత మైదానంలో అతని మెరుపు బ్యాటింగ్‌ను చూసేందుకు ఎంతో ఉత్సాహంతో మైదానానికి వచ్చిన ఫ్యాన్స్ రెండో మ్యాచ్‌లోనూ డకౌట్‌ను చూడాల్సి వచ్చింది. లక్నోతో జరిగిన గత మ్యాచ్‌లో రెండో బంతికి సున్నా చుట్టిన అభిషేక్ ఈసారి తొలి బంతికే పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు.
నితీశ్ మళ్లీ మూడు సిక్స్‌ల మోత...
హైదరాబాద్‌లో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో దిగ్వేశ్ రాఠీ వేసిన ఒకే ఓవర్లో మూడు సిక్స్‌లు బాదిన నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌లోనూ అదే ఫీట్‌ను పునరావృతం చేశాడు. సందీప్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో లాంగాన్ మీదుగా రెండు వరుస సిక్స్‌లు బాదిన అతను అదే ఓవర్ చివరి బంతికి డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్‌లెగ్ దిశగా మరో సిక్స్‌తో తన ధాటిని ప్రదర్శించాడు.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) బిష్ణోయ్ (బి) ఆర్చర్ 0; హెడ్ (సి) ఫెరీరా (బి) పరాగ్ 18; ఇషాన్ కిషన్ (సి అండ్ బి) సందీప్ 91; క్లాసెన్ (సి) పరాగ్ (బి) తుషార్ 40; నితీశ్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 28; సలీల్ (నాటౌట్) 24; అనికేత్ (రనౌట్) 6; దూబే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 216. వికెట్ల పతనం: 1–0, 2–55, 3–143, 4–162, 5–195, 6–209.
బౌలింగ్: ఆర్చర్ 4–0–37–2, బర్గర్ 4–0–31–0, సందీప్ 4–0–52–1, తుషార్ 4–0–55–1, పరాగ్ 1–0–5–1, బిష్ణోయ్ 3–0–35–0.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) నితీశ్ (బి) సాకిబ్ 1; వైభవ్ (సి) అరోరా (బి) ప్రఫుల్ హింగే 0; జురేల్ (బి) ప్రఫుల్ హింగే 0; ప్రిటోరియస్ (సి) నితీశ్ (బి) ప్రఫుల్ హింగే 0; పరాగ్ (సి) అభిషేక్ (బి) ప్రఫుల్ హింగే 4; జడేజా (సి) అరోరా (బి) ఇషాన్ మలింగ 45; ఫెరీరా (బి) సాకిబ్ 69; ఆర్చర్ (సి) ప్రఫుల్ హింగే (బి) సాకిబ్ 2; తుషార్ (సి) కిషన్ (బి) ఇషాన్ మలింగ 25; బిష్ణోయ్ (సి) కిషన్ (బి) సాకిబ్ 0; బర్గర్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 159.
వికెట్ల పతనం: 1–1, 2–1, 3–1, 4–2, 5–9, 6–127, 7–129, 8–140, 9–140, 10–159.
బౌలింగ్: ప్రఫుల్ హింగే 4–0–34–4, సాకిబ్ 4–0–24–4, ఇషాన్ మలింగ 4–0–31–2, శివాంగ్ 3–0–28–0, నితీశ్ 2–0–19–0, హర్ష్ దూబే 2–0–22–0.


