Ashes Series 2021: తొలి టెస్ట్‌ తుది జట్టు కూర్పుపై ఇంగ్లండ్‌ బౌలర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Stuart Broad Reveals Awkward Moment With Glenn McGrath Ahead Of Ashes 1st Test - Sakshi

Stuart Broad Reveals Awkward Moment With Glenn McGrath Ahead Of Ashes 1st Test: యాషెస్‌ సిరీస్‌ 2021-22లో భాగంగా బ్రిస్బేన్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిధ్య ఆసీస్‌ జట్టు ఇంగ్లండ్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ తుది జట్టు కూర్పుపై సీనియర్‌ పేసర్‌ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గబ్బా టెస్టులో చోటు దక్కకపోవడం నిరుత్సాహానికి గురి చేసిందని, తుది జట్టులో ఆడిన ప్లేయర్లలో ఒక్క సీమర్ కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, తుది జట్టు కూర్పు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదని పెదవి విరిచాడు. ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు జరిగిన ఓ సన్నివేశం గురించి బ్రాడ్‌ ప్రస్తావించాడు. 


టాస్‌కి ముందు ఫీల్డ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆసీస్ లెజెండరీ బౌలర్‌ గ్లెన్ మెక్‌గ్రాత్ తన వద్దకు వచ్చి 150వ టెస్ట్‌ ఆడబోతున్నందుకు శుభాకాంక్షలు తెలిపాడని, నేను అతనికి థ్యాంక్స్‌ కూడా చెప్పానని, తీరా చూస్తే తుది జట్టులో తన స్థానం గల్లంతు కావడంతో తలకొట్టేసినట్లయ్యిందని వాపోయాడు. తాను తుది జట్టులో ఉంటాననుకుని మెక్‌గ్రాత్‌తో పాటు చాలా మంది విష్‌ చేశారని, కానీ ఆఖరి నిమిషంలో తాను టీమ్‌లో లేనని తెలియడంతో సిగ్గుతో మొహం చాటేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధపడ్డాడు. 


తాను తుది జట్టులో ఆడి ఉంటే జట్టుకు ఉపయోగకరంగా ఉండేవాడినని ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. కాగా, బ్రాడ్‌ 149 టెస్టుల్లో 524 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఇంగ్లండ్ బౌలర్‌గా జేమ్స్ అండర్సన్(166 టెస్ట్‌ల్లో 633 వికెట్లు) తర్వాతి స్థానంలో ఉన్నాడు.ఇదిలా ఉంటే, తొలి టెస్ట్‌లో ఎదురైన పరాభవం దృష్ట్యా ఇంగ్లండ్‌ తుది జట్టు(రెండో టెస్ట్‌)లో భారీ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. బ్యాటింగ్‌ విభాగంలో పలు మార్పులతో పాటు స్టువర్ట్ బ్రాడ్‌, మరో సీనియర్‌ బౌలర్‌ జేమ్స్ అండర్సన్‌లకు తుది జట్టులో చోటు దక్కడం ఖాయమని సమాచారం. 

చదవండి: యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్‌.. డేవిడ్‌ వార్నర్‌కు గాయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top