శ్రీలంకకు వన్డే ప్రపంచకప్ అందించిన దిగ్గజ కెప్టెన్ అర్జున రణతుంగ (Arjuna Ranatunga). సహచర, మాజీ క్రికెటర్లతో కలిసి రణతుంగ ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. సనత్ జయసూర్య, అరవింద డి సిల్వ, ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి తమిళ యూనియన్ 125వ వార్షికోత్సంలో రణతుంగ భాగమయ్యాడు.
ఎరుపు రంగు కుర్తాలో
ఈ కార్యక్రమంలో తాము దిగిన ఫొటోను సనత్ జయసూర్య సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో సనత్ జయసూర్య, అరవింద డి సిల్వ, ముత్తయ్య మురళీధరన్‌లను సులువుగానే గుర్తుపట్టిన అభిమానులు.. అర్జున రణతుంగను మాత్రం పోల్చుకోలేకపోతున్నారు. మిగిలిన ముగ్గురు సూట్‌లో కనిపించగా.. రణతుంగ ఎరుపు రంగు కుర్తాలో దర్శనమిచ్చాడు.

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రికెట్ దిగ్గజం
రణతుంగ జట్టు మొత్తం తెల్లబడింది. అంతేకాదు.. క్రికెట్ ఆడే రోజుల్లో బొద్దుగా ఉన్న అతడు ఇప్పుడు మాత్రం బక్కచిక్కిపోయి.. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.. రణతుంగా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పటికి.. ఇప్పటికి అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం అని కామెంట్లు చేస్తున్నారు.
రణతుంగ కెప్టెన్సీలో
కాగా కొలంబోలో 1963లో జన్మించిన రణతుంగ.. 1982లో శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇంటర్నేషనల్ కెరీర్‌లో మొత్తంగా 93 టెస్టులు, 269 వన్డేలు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. టెస్టుల్లో 5105, వన్డేల్లో 7456 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో నాలుగు టెస్టు, నాలుగు వన్డే సెంచరీలు ఉన్నాయి.
ఇక రణతుంగ కెప్టెన్సీలో 1996లో వన్డే వరల్డ్‌కప్ గెలిచింది శ్రీలంక. కాగా 2001లో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన రణతుంగ.. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఇక 2008లో శ్రీలంక క్రికెట్ బోర్డు చైర్మన్‌గా ఎన్నికైన రణతుంగను అధికారులు గద్దె దించారు. దీంతో కనీసం ఏడాది కాలం కూడా చైర్మన్‌గా పనిచేయకుండానే రణతుంగ శకం ముగిసిపోయింది.
ఇక 61 ఏళ్ల రణతుంగకు భార్య రుక్మిణి, ఇద్దరు కుమారులు బినుర, మాహీ ఉన్నారు. కాగా రణతుంగకు నలుగురు తోబుట్టువులు కాగా.. వారంతా ఏదో ఒక దశలో క్రికెట్ ఆడిన వారే.


